వరంగల్‌ నిట్‌లో 11 మంది విద్యార్థులకు కరోనా

వరంగల్ : వరంగల్‌ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్‌)లో కరోనా కలకలం రేపింది. నిట్‌లో చదువుతున్న 11 మంది విద్యార్థులకు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఈ నెల 16 వరకు కళాశాలకు సెలవులు ప్రకటిస్తూ నిట్ డైరెక్టర్ ఉత్తర్వులు విడుదల చేశారు. కొవిడ్ వచ్చిన వారికి ఐసోలేషన్‎లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు డైరెక్టర్ తెలిపారు.

ఇటీవల క్రిస్మస్‌ వేడుకలకు ఇంటికి వెళ్లి వచ్చిన 200 విద్యార్థులకు అధికారులు కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 11 మంది విద్యార్థులకు పాజిటివ్ గా తేలింది. పాజిటివ్ వచ్చిన.. వారందరినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నిట్‌లో కరోనా కేసులు వెలుగుచూడడంతో తరగతులను నిలిపివేశారు. ప్రైమరీ కాంటాక్టు అయిన వారందరూ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఈ నెల 16 వరకు పలు తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో బోధన చేయనున్నట్లు నిట్‌ డైరెక్టర్‌ వెల్లడించారు. మిగతా విద్యార్థులు, ఉద్యోగులందరికీ కూడా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/