నటుడు నటుడు చలపతిరావు కన్నుమూత..

కైకాల సత్యనారాయణ మరణ వార్త నుండి ఇంకా సినీ జనాలు బయటపడకముందే మరో విషాద ఘటన టాలీవుడ్ లో చోటుచేసుకుంది. ఈ ఏడాది ఇప్పటికే ఎంతోమందిని పోగొట్టుకున్న చిత్రసీమ..తాజాగా సీనియర్ నటుడు చలపతిరావు ను పోగొట్టుకుంది. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈయన వయసు 78 ఏళ్లు.

ఎన్నో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరిస్తోన్న చలపతిరావు‌ను సినిమా వాళ్లంతా ముద్దుగా బాబాయ్ అని పిలుచుకుంటారు. మహానటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో కలిసి పనిచేసిన దిగ్గజ నటుడు చలపతిరావు. ఆదివారం తెల్లవారు జామున గుండెపోటుతో హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో ఆయ‌న క‌న్నుమూశారు. 1200కి పైగా చిత్రాల్లో ఎన్నో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో ఆయ‌న న‌టించారు. 1944 మే 8న కృష్ణా జిల్లా బ‌ల్లి ప‌ర్రులో చ‌ల‌ప‌తిరావు జ‌న్మించారు. ఈయ‌న‌కు ఇద్ద‌రు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం చలపతిరావు పార్థివదేహాన్ని కుమారుడు రవి బాబు ఇంట్లో ఉంచారు. అమెరికా లో ఉంటున్న ఆయన కుమార్తెలు వచ్చిన తర్వాత అంత్యక్రియలు జరపనున్నారు. చలపతిరావు మరణ వార్త తెలిసి సినీ ప్రముఖులు నివాళ్లు అర్పిస్తున్నారు.

చలపతి రావు నటించిన తొలి సినిమా గూఢచారి 116. తర్వాత నటుడిగా తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. విలన్ కొడుకుగా, హీరో సహాయకుడిగా, సైడ్ విలన్‌గా, మెయిన్ విలన్‌గా ఇలా ఎన్నో పాత్రల్లో నటించారు.