“కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ” ని స్థాపించిన గాలి జనార్దన్ రెడ్డి

గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారని గత కొద్దీ రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతూ వస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఇప్పుడు ఆ ప్రచారానికి తెరపడింది. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న గాలి జనార్దన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బిజెపి పార్టీకి రాజీనామా చేసి.. సొంతంగా కొత్త పార్టీని ప్రకటించారు. గత కొంతకాలంగా బిజెపిపై అసంతృప్తితో ఉన్న జనార్దన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి “కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ” ని ఆదివారం బెంగుళూరులోని తన నివాసంలో ప్రకటించారు.

గాలి జనార్దన్ రెడ్డి అంటే తెలియని వారు లేరు. మైనింగ్ రారాజు గా గాలి జనార్దన్ రెడ్డి ని పిలుస్తారు. మైనింగ్ లో కొన్ని వందల కోట్లను సంపాదించాడు. అంతే కాదు అక్రమ మైనింగ్ కేసులో రెండేళ్ల పాటు జైలు జీవితాన్ని కూడా గడిపాడు. ప్రస్తుతం జైలు నుండి బయటకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి..తన వ్యాపారాలను చేసుకుంటూ గడిపేస్తున్నాడు. అయితే బిజెపి నేతగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి..ఇప్పుడు సొంతంగా పార్టీ ని ప్రకటించారు. గాలి జనార్దన్ రెడ్డి కి ఉన్న పలుకుబడి , డబ్బు తో కర్ణాటకలో దాదాపు 20 అసెంబ్లీ స్థానాలను ప్రభావితం చేయగలడని ఆయన శ్రేణులు అంటున్నారు.

రానున్న శాసనసభ ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు గాలి జనార్దన్ రెడ్డి. గంగావతి నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగనున్నట్లు వెల్లడించారు. బిజెపితో తన బంధం ముగిసింది అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి మూలకు చేరుకునేలా తన పార్టీని నిర్మిస్తానని తెలిపారు. కర్ణాటక ప్రజల హృదయాలను తమ పార్టీ గెలుచుకుంటుందని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు.