సీఎం రేవంత్ ఫై మోడీ విచారణ జరిపించాలంటూ కేసీఆర్ డిమాండ్

తెలంగాణ లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఎవ్వరు..ఎక్కడ తగ్గడం లేదు. సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగిస్తున్నారు. ఇక గులాబీ బాస్ కేసీఆర్ మరోసారి తన నోటికి పనిచెప్పారు. గత వారం రోజులుగా బస్సు యాత్ర చేపట్టిన కేసీఆర్ నిన్న కొత్తగూడెం కు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన రోడ్ షో లో సీఎం రేవంత్ ఫై మోడీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.

మెదక్ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపణలు చేశాడని తెలిపారు. ఆయన చెప్పింది నిజమే అయితే… వారు మిలాఖత్ కాకుంటే దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కానీ మోదీకి అది చేతకాదన్నారు. పైకి మాత్రమే తాము వేరు అన్నట్లుగా నాటకాలు ఆడుతున్నారని, కానీ మోదీ, రేవంత్ ఇద్దరూ ఒక్కటేనని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల కథ ముగిసిందని, అందుకే బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తన కంఠంలో ప్రాణమున్నంత వరకు తెలంగాణ ప్రజల హక్కుల గురించి పోరాడుతూనే ఉంటానన్నారు. మీ బిడ్డగా ఆనాడు తెలంగాణ రాష్ట్రం తెస్తానని చెప్పానని… తన ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ తీసుకు వచ్చానన్నారు. అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని చూసుకున్నామన్నారు.