తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారు – సీఎం రేవంత్ రెడ్డి

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి తన దూకుడును కనపరుస్తున్నారు. ఇటు రాష్ట్రంలోని గత ప్రభుత్వం బిఆర్ఎస్ పైన, అటు కేంద్రంలోని బిజెపి సర్కార్ ఫైన నిప్పులు చెరుగుతూ ఓటర్లను ఆకట్టుకున్నారు. మంగళవారం భూపాలపల్లిలో ఏర్పటు చేసిన జనజాతర సభలో మాట్లాడుతూ… అమిత్ షాను కేసీఆర్ ఆవహించినట్లున్నారని ఎద్దేవా చేశారు.

వరంగల్‌కు ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టు రాకుండా ప్రధాని అడ్డుకున్నారని , హామీల గురించి అడిగితే తనపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్రలు చేస్తోందని , రిజర్వేషన్ల రద్దు కోసమే బీజేపీ 400 సీట్లలో గెలిపించాలని అడుగుతోందన్నారు. రాముడి పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతుందని విమర్శించారు. సాధారణంగా సీతారాముల కల్యాణం చేసిన తర్వాత అక్షితలు ఇస్తారని, కానీ కల్యాణం జరగకముందే బీజేపీ నేతలు ఇక్కడ అక్షితలు పంచారని మండిపడ్డారు. తామంతా రాముని భక్తులమేనని స్పష్టం చేశారు. తమకంటే గొప్ప హిందువులు ఉన్నారా? అని ప్రశ్నించారు.

మోడీ అధికారంలోకి వచ్చాక కర్ణాటకకు చెంబు, ఏపీకి మట్టి, చెంబు నీళ్లు, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని ఈ సందర్భాంగా రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణకు ఈ గుడ్డు ఇచ్చినందుకు బీజేపీకి ఓటు వేయాలా? అని ప్రశ్నించారు.