తెనాలి నుండి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ను గెలిపించాలని కోరిన బాబు

ఎన్నికల ప్రచారంలో టిడిపి అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు ఉత్సహంగా పాల్గొంటున్నారు. మండు ఎండను సైతం ఏమాత్రం లెక్కచేయకుండా ప్రచారం చేస్తూ పార్టీ శ్రేణుల్లో , అభిమానుల్లో ఉత్సహం నింపుతున్నారు. మంగళవారం తెనాలి ప్రజాగళం సభలో చంద్రబాబు ఉత్సాహంగా ప్రసంగించారు. మే 13తో రాష్ట్రానికి సైకో పీడ వదిలించుకునేందుకు సిద్ధంగా ఉన్నారా, లేరా? అని ప్రశ్నించారు. తెనాలి అసెంబ్లీ స్థానం జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ను, గుంటూరు ఎంపీ స్థానం టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ను గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఈరోజు తాను, పవన్ కల్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ మేనిఫెస్టో విడుదల చేశామని , మన మేనిఫెస్టోకి, సైకో మేనిఫెస్టోకి పోలిక ఉందా? అని ప్రశ్నించారు. సుపరిపాలన అంటూ ఒక పక్క సంక్షేమం ఉండాలని, మరోపక్క అభివృద్ధి ఉండాలని చంద్రబాబు వివరించారు. ఈ ముఖ్యమంత్రి తనను ఎవరేం చేస్తారన్న అహంకారంతో ఉన్నాడని, ఆ అహంకారం దిగాలంటే అది ప్రజల చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. జగన్ వంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడని, చిత్తుచిత్తుగా ఓడించి ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.