త్వరలో పిల్లలకు టీకా: హైకోర్టుకు తెలిపిన కేంద్రం

అత్యవసర వినియోగ అనుమతులకు జైడస్ దరఖాస్తు

న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుతం 18 ఏళ్లు పైబడిన వారికే కరోనా టీకా ఇస్తుండగా త్వరలోనే 12 నుంచి 18 ఏళ్ల లోపు వారికి కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. మైనర్లకు కూడా టీకా అందించాలని కోరుతూ ఢిల్లీకి చెందిన తియా గుప్తా అనే బాలిక ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

దీంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. గుజరాత్‌కు చెందిన దేశీయ ఫార్మాస్యూటికల్ సంస్థ జైడస్ కాడిలా అభివృద్ధి చేసిన ‘జైకోవ్-డి’ టీకా త్వరలోనే అందుబాటులోకి రానుందని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ టీకాపై ప్రయోగాలు పూర్తయ్యాయని తెలిపింది. వినియోగ అనుమతి కోసం ఇప్పటికే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి దరఖాస్తు కూడా చేసినట్టు వివరించింది. ప్రపంచంలోనే డీఎన్ఏ ఆధారంగా తయారైన తొలి టీకా ‘జైకోవ్-డి’నే. దీనిని మూడు దఫాలుగా తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోసు తీసుకున్న 28 రోజులకు రెండో డోసు, 56 రోజుల్లో చివరి డోసు తీసుకోవాలి. 12 ఏళ్ల పైబడిన వారిపై చేసిన ప్రయోగాల్లో అద్భుత ఫలితాలు వచ్చినట్టు జైడస్ కాడిలా ఇదివరకే ప్రకటించింది.

కాగా, భారత్ బయోటెక్ కూడా చిన్నారులకు వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/