కర్ణాటక ఎన్నికల బరిలో కేజీఎఫ్‌ బాబు భార్య..

మరికొద్ది రోజుల్లో కర్ణాటక లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అక్కడి రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఇప్పటికే పలు పార్టీలు అభ్యర్థుల లిస్ట్ ప్రకటిస్తుండగా..టికెట్ దక్కని వారు ఆయా పార్టీలకు రాజీమానా చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటె ఈ ఎన్నికల బరిలో కర్ణాటక రాష్ట్రంలోని కోటీశ్వరుల్లో కేజీఎఫ్ వాసి యూసుఫ్ షరీఫ్ అలియాస్ కేజీఎఫ్ బాబు ..తన భార్య ను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నాడు.

గుజిరీ వ్యాపారాన్ని ప్రారంభించి రూ.కోట్లకు పడగలెత్తిన యూసుఫ్ షరీఫ్.. కేజీఎఫ్ బాబుగా ప్రజల్లో గుర్తింపుపొందారు. కేజీఎఫ్‌ బాబు రెండేండ్ల క్రితం కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో చిక్క పేట నుంచి పోటీ చేయాలని భావించారు. ఇందులో భాగంగా తనకు చిక్కపేట స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన కాంగ్రెస్ నేతలను కోరుతూ వచ్చారు. కానీ, అలాంటి అవకాశం ఇవ్వకపోగా, పార్టీ నేతల్లో నెలకొన్న విభేదాల కారణంగా ఏకంగా ఆయనపై సస్పెండ్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ బాబు తన భార్య షాజియాను స్వతంత్ర అభ్యర్థిగా తను కోరుకున్న స్థానం నుంచి బరిలోకి దించుతున్నారు. ఇందుకోసం ఆమె గురువారం నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేశారు. తన భర్త బాబు, కుమార్తెతో కలిసి నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.