తక్షణమే ఆరోగ్యశ్రీని అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలు చేయాలిః షర్మిల

పెండింగ్ బకాయిలు 800 కోట్లు చెల్లించాలన్న షర్మిల

YSRTP Chief YS Sharmila

హైదరాబాద్‌ః ఆరోగ్యశ్రీ పథకం అమలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీరుపై వైఎస్ఆర్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. సంజీవనిలా పనికొచ్చే ఆరోగ్యశ్రీని కోమాలో పెట్టి అనారోగ్యశ్రీగా మార్చారని, పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని దూరం చేశారని ఆరోపించారు.

‘మహానేత వైయస్ఆర్ తెచ్చిన పథకాలు అద్భుతమని, వాటి అమలులో పిచ్చి భేషజాలు లేవని, అసెంబ్లీ వేదికగా గొప్పలు చెప్పిన దొర గారు.. ఇన్నాళ్లు చెప్పిందొకటి చేసిందొకటి. పైకి కపట ప్రేమను నటిస్తూ లోపల కాలకూట విషాన్ని చిమ్మిండు. సంజీవనిలా పనికొచ్చే ఆరోగ్యశ్రీని కోమాలో పెట్టి అనారోగ్యశ్రీగా మార్చారు. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని దూరం చేశారు. ఏటికేటా బిల్లులు చెల్లించక ఆరోగ్యశ్రీ పేరు చెప్తేనే కేసులు పట్టకుండా చేశారు. కంటికి పంటికి జబ్బు చేస్తే ఢిల్లీకి, కార్పొరేట్ దవాఖానకు పరుగులు పెట్టే దొర.. పేదోడికి దక్కాల్సిన కార్పొరేట్ వైద్యాన్ని కిల్ చేశాడు. ఉచిత వైద్యం అందిచాల్సిన సర్కారీ దవాఖానలకే పథకాన్ని పరిమితం చేశాడు’ అని షర్మిల ట్వీట్ చేశారు.

ఎన్నికల సమీపించడంతోనే ఆరోగ్యశ్రీ ప్రీమియాన్ని 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారని విమర్శించారు. ఆసుపత్రులకు పెండింగ్ బకాయిలు 800 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఆరోగ్యశ్రీని అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలు చేయాలంటూ షర్మిల ట్వీట్ చేశారు.