వెటరన్ సైనికులపై వ్యవహరించిన తీరుకు క్షమాపణః రుషి సునాక్

ఎల్‌జీబీటీలను నిషేధించడం ఘోర వైఫల్యమని వ్యాఖ్య

Rishi Sunak apologises to LGBT veterans for past armed forces gay ban

లండన్‌ః బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామన్స్ లో ఇంగ్లాండ్ ప్రధాని రిషి సునాక్ సంచలన ప్రకటన చేశారు. తమ సైన్యానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన స్వలింగ సంపర్కులైన (ఎల్‌జీబీటీ) సైనికులకు బ్రిటీష్ ప్రభుత్వం తరపున క్షమాపణ తెలియజేశారు. స్వలింగ సంపర్కులను సైన్యంలోకి తీసుకోకుండా నిషేధించడం బ్రిటీష్ ప్రభుత్వం ఘోర వైఫల్యమని అన్నారు.

‘‘2000 సంవత్సరం వరకు మా సైన్యంలో పని చేసిన ఎల్‌జీబీటీ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌ జెండర్) వ్యక్తులపై నిషేధం బ్రిటిష్ భయంకరమైన వైఫల్యం. స్వలింగ సంపర్కులను సైన్యం నుంచి నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారి జీవితాలపై, కుటుంబాలపై ఎంతటి తీవ్ర ప్రభావం చూపిందో మేం అర్థం చేసుకున్నాం” అని చెప్పారు.

నాడు వివక్షకు గురైన ఆనాటి వీరులందరికీ బ్రిటీష్ ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నానని రిషి సునాక్ తెలిపారు. ‘‘మీరు కూడా మిగతా సైనికుల్లానే దేశం కోసం చేసిన త్యాగాలను, క్లిష్ట సమయాల్లో చూపిన ఆపార ధైర్య సాహసాలను తలచుకుని గర్వపడాలి” అని చెప్పారు. ఆయన ప్రకటన చేయగానే సభ్యులంతా హర్షాతిరేకాలు తెలిపారు.

కాగా.. రిటైర్డ్ జడ్జి, ఎంపీ లార్డ్ టెరెన్స్ ఈథర్టన్ అధ్యక్షతన.. యూకే రక్షణ శాఖ, వెటరన్స్ అఫైర్స్ కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటైన స్వతంత్ర సమీక్ష కమిటీ.. 1967-2000 మధ్య సాయుధ దళాల్లో స్వలింగ సంపర్కంపై నిషేధం కారణంగా ప్రభావితమైన వారి అనుభవాలను పరిశీలించింది. ఆయా వ్యక్తులపై 2000కి ముందు జరిపిన దర్యాప్తులు అనుచితమైనవని ఈ కమిటీ నిర్ధారించింది. ప్రభుత్వ నిర్ణయం కొంతమంది వెటరన్ సైనికులు, వారి కుటుంబాల జీవితాలపై దీర్ఘకాలిక, తీవ్రమైన ప్రభావాలను కలిగించిందని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలోనే రిషి సునాక్ క్షమాపణలు తెలిపారు.