గ్లాస్ పవన్ తెచ్చుకుంటే.. టీ చంద్ర బాబు పోశారుః ఎంపీ నందిగం సురేశ్

ముందు ఎమ్మెల్యే అవ్వడానికి ప్రయత్నించాలని వ్యాఖ్య

ysrcp-mp-nandigam-suresh-satirical-comments-on-pawan-kalyan

అమరావతిః జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై బాపట్ల వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ నందిగం సురేశ్ మండిపడ్డారు. పవన్ తీరు వీధి రౌడీలా ఉందంటూ ఫైరయ్యారు. ‘‘పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడు కాదు.. అసాంఘిక శక్తి. రాష్ట్రానికి హానికరమైన వ్యక్తిగా తయారయ్యారు” అంటూ తీవ్రంగా విమర్శించారు. ‘‘పవన్‌ ఊగుతూ వాగుతుంటారు. సాధారణంగా మందు తాగినవాళ్లు మాత్రమే ఊగాలి, వాగాలి. కానీ పవన్‌ కల్యాణ్‌ ఎందుకు అలా ఊగుతున్నారు?” అని నందిగం సురేశ్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు దగ్గర పవన్ చేస్తున్న బానిసత్వానికి అలసట అనేదే లేదంటూ దుయ్యబట్టారు.

గ్లాస్ పవన్ తెచ్చుకుంటే.. టీ చంద్ర బాబు పోశారని ఎద్దేవా చేశారు. జగన్ సంక్షేమం చేస్తుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందని పవన్ అంటున్నారని, మరి అదే పవన్ అధికారంలో వస్తే జగన్ కంటే ఎక్కువ చేస్తామనటానికి సిగ్గు ఉండాలని మండిపడ్డారు. ‘‘పవన్ క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నారు. ప్యాకేజీని ఏ క్లాస్ నుంచి అందుకున్నారు? పవన్ పోటీ చేసిన స్థానాల్లో ఖర్చు పెట్టిన డబ్బు ఏ క్లాస్ నుంచి వచ్చింది? పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని వ్యతిరేకించడం ఏ క్లాస్ వార్ ?పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించడం ఏ క్లాస్ వార్?” అని నిలదీశారు.

‘‘పవన్ ఎవరినైనా వ్యక్తిగతంగా విమర్శించవచ్చా? ఆయన్ని ఎవరూ ఏమీ అనకూడదా?” అని ప్రశ్నించారు. సింగిల్ గా పోటీ చేస్తామని చెప్పే దమ్ము పవన్ కి ఉందా అని ప్రశ్నించారు. పవన్ గొప్పవాడు అయితే రెండు చోట్లా ఎందుకు ఓడిపోయారని నిలదీశారు. ముందు ఎమ్మెల్యే అవ్వడానికి ప్రయత్నం చెయ్యాలని సెటైర్లు వేశారు. తమ పార్టీ నేతల పర్సనల్ విషయాలు ఆయన వద్ద ఏమున్నాయో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ‘‘పవన్ కల్యాణ్ ఉడత ఊపులకు భయపడే వ్యక్తి కాదు జగన్. పవన్.. వైఎస్‌ఆర్‌సిపి పోవడం తర్వాతి సంగతి. ముందు ఎమ్మెల్యే గా గెలిచి అసెంబ్లీ గేటు దాటు చూద్దాం’’ అంటూ సవాల్ విసిరారు.