ఒడిశా రైలు ప్రమాదం.. ఇంకా గుర్తించబడని 52 మృతదేహాలు

odisha-train-accident-52-bodies-at-aiims-bhubaneswar-yet-to-be-identified

భువనేశ్వర్‌: ఒడిశాలో గత నెల 2న బహనాగ బజార్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 291 మంది మరణించగా, 1,100 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగి నెలరోజులు కావస్తున్నా.. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ప్రమాదం జరిగిన తర్వాత వందలాది మృతదేహాలను భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. అయితే, వాటిలో ఇప్పటికీ 81 మృతదేహాలు అక్కడే ఉన్నాయి.

‘రైలు ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారిలో 81 మృతదేహాలు ఇంకా మార్చురీలో ఉన్నాయి. వాటిని భువనేశ్వర్ ఎయిమ్స్ లో భద్రపరిచాం. వాటి నుంచి నమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షలకు పంపించాం. అందులో 29 మృతదేహాలను గుర్తించి.. వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించాం. గుర్తించిన వాటిలో ఐదు మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాం. మిగతా వాటిని అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. వాటిని తీసుకెళ్లేందుకు వారి బంధువులు వస్తున్నారు. ప్రస్తుతం ఎయిమ్స్ మార్చురీలో 76 మృతదేహాలు ఉన్నాయి. వాటిలో ఇంకా 52 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది’ అని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దాస్ తెలిపారు.

మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేరకు మృతదేహాలను వారి ఊర్లకు తరలించేందుకు రవాణా సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు దాస్ చెప్పారు. మృతదేహాలను తమ ఊర్లకు తీసుకెళ్లని పక్షంలో బంధువుల విన్నపం మేరకు అంత్యక్రియల కోసం భువనేశ్వర్ లోని రెండు ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.