ఆత్మకూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి..?

ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించడం తో ఆత్మకూరు నియోజకవర్గం ఎమెల్యే సీటు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమయింది. ఈ క్రమంలో మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబంలో నుంచే ఒకరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలనీ జగన్ భావించారు. మొన్నటి వరకు మేకపాటి గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీకీర్తి రెడ్డి కే అవకాశం ఇవ్వాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు అయితే కీర్తి రెడ్డి కాకుండా.. మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు.. మేకపాటి విక్రమ్ రెడ్డిని ఆత్మకూర్ ఉప ఎన్నికలో బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పటికే మేకపాటి కుటుంబం.. విక్రమ్ రెడ్డి పేరును ఫైనల్ చేసినట్టు సమాచారం. త్వరలోనే వైసీపీ అధినేత జగన్ కూడా విక్రమ్ రెడ్డి పేరును ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరుపతి లోక్ సభ, బద్వేల్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ రెండు నియోజకవర్గాలు అప్పటికే అధికార వైసీపీ పార్టీ చేతిలో ఉన్నాయి, ఉప ఎన్నికల తర్వాత కూడా వైసీపీయే అక్కడ విజయం సాధించి, ఆ రెండు నియోజకవర్గాల్లో తన పట్టును నిలుపుకుంది. అయితే తిరుపతి లోక్సభ ఎన్నికలో మత్రం సీఎం జగన్ సంప్రదాయానికి భిన్నంగా దివంగత నేత బల్లి దుర్గా ప్రసాదరావు కుటుంబ సభ్యులకు కాకుండా, అసలు అక్కడ రాజకీయాలకు సంబంధం లేని డాక్టర్ గురుమూర్తిని అభ్యర్థిగా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మరోవైపు బద్వేల్ ఉప ఎన్నిక విషయానికొస్తే దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య స్థానంలో ఆమె భార్య సుధకు అవకాశమిచ్చారు. ఎమ్మెల్యే స్థానంలో ఆయన భార్యకు అవకాశం ఇవ్వడంతో టీడీపీ పోటీనుంచి తప్పుకోగా, జనసేన ఎన్నికలకు దూరంగా ఉంది.బీజేపీ మాత్రం పట్టుబడ్డి అక్కడ పోటీ చేసి ఓడిపోయింది. ఇక ఇప్పుడు ఆత్మకూరు నియోజకవర్గం వంతు వచ్చింది.