కానిస్టేబుల్‌పై షర్మిల దాడిపై స్పందించిన వైఎస్ విజయమ్మ

TSPSC పేపర్ లీక్ వ్యవహారంలో సిట్ అధికారులను కలిసే ప్రయత్నం చేసిన YSRTP అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు ఆదుకోవడం.. ఈ క్రమంలో షర్మిల ఓ మహిళా పోలీసుపై చేయి చేసుకోవడం, మరో పోలీసు అధికారిని నెట్టివేయడం జరిగిన సంగతి తెలిసిందే. డ్యూటీ లో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్న కారణంగా షర్మిల ఫై ఐపీసీ 353 , 330 సెక్షన్ల కింద అరెస్ట్ చేసారు. ఈ దాడి ఫై విజయమ్మ స్పందించారు.

ప్రజల కోసం పోరాటం చేస్తున్న షర్మిలను అక్రమంగా అరెస్ట్ చేశారని, ప్రశ్నించే గొంతుకను అణిచివేస్తున్నారని వ్యాఖ్యానించారు. పోలీసులపై దాడి చేశానన్న వార్తలను ఖండించిన ఆమె.. పోలీసులపై ఎలాంటి దాడి చేయలేదని స్పష్టం చేశారు. కేవలం అరెస్టు చేస్తుంటే వారిని అడ్డుకున్నానని వివరించారు. వైఎస్ షర్మిల అరెస్టుపై కోర్టులో పిటిషన్ వేస్తామని ఈ సందర్భంగా విజయమ్మ తేల్చి చెప్పారు. ఆమె సిట్ దగ్గరకు వెళ్తుంటే అరెస్ట్ చేశారని, అసలు షర్మిల సిట్ ఆఫీస్ కు వెళ్తే సమస్యేంటీ అని ప్రశ్నించారు.

సర్కార్ ను ప్రశ్నించినందుకే వైఎస్ షర్మిలను అరెస్టు చేశారని విజయమ్మ ఆరోపించారు. ప్రశ్నించే గొంతును ఈ ప్రభుత్వం అణిచివేస్తోందని విమర్శించారు. షర్మిలను ఎందుకు అరెస్ట్ చేశారంటే పోలీసుల దగ్గర్నుంచి ఎలాంటి సమాధానం లేదని ఆమె చెప్పారు. ఇంకా ఎంతకాలం షర్మిలను అడ్డుకుంటారు అంటూ విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతమంది మహిళా పోలీసులు తమ మీద పడుతుంటే ఆవేశం రాదా? అంటూ ప్రశ్నించారు.

కొన్ని ఛానెళ్లు పదే పదే చూపిస్తున్నాయి. అది సరికాదు. ప్రజల సమస్యలపై పోరాడే వారికి మీడియా అండగా ఉండాలి. నిరుద్యోగుల కోసం షర్మిల పోరాడుతోంది. ప్రజల కోసం పోరాడే గొంతుకను అరెస్ట్ చేస్తారా? పోలీసులకు చేతనైన పని షర్మిలను అరెస్ట్ చేయడమే అని విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేసారు.