మంత్రి నిరంజన్ రెడ్డిపై ఈడీకి ఫిర్యాదు చేస్తా..ఎమ్మెల్యే రఘునందన్ రావు

mla-raghunandan-rao-that-he-will-complain-to-ed-against-minister-niranjan-reddy

హైదరాబాద్‌ః మంత్రి నిరంజన్ రెడ్డిపై బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. కొద్దిరోజులుగా నిరంజన్ రెడ్డికి సంబంధించిన ఫామ్‌హౌస్‌లపై, భూ అక్రమాలపై కొద్ది రోజులుగా రఘునందన్ రావు పలు అంశాలను వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. వాటిపై మంత్రి కూడా వివరణ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు తాజాగా రఘునందన్ రావు కొత్త అంశాన్ని ప్రస్తావించారు. నిరంజన్ రెడ్డి దత్తపుత్రుడికి ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ ఎలా దక్కాయని ప్రశ్నించారు. అగ్రికల్చర్ వర్సిటీ వీసిగా వియ్యంకుడ్ని నియమించుకున్నారని ఆరోపించారు. మంత్రి భూమి వరకు 3 కిలోమీటర్లు సీసీ రోడ్డు వేశారని.. గతంలో ప్రశ్నిస్తే రైతులతో కలిసి రోడ్డు వేసుకున్నట్లు మంత్రి సమాధానమిచ్చారన్నారు. రూ.5 కోట్లు ఖర్చయ్యే సీసీ రోడ్డును రైతులు చందాలు వేసుకుని నిర్మించారా అంటూ ప్రశ్నించారు. దత్తపుత్రుడిపై ఐటీ అధికారులను ఫిర్యాదు చేస్తానన్నారు.

చైనాకు చెందిన మో అనే వ్యక్తితో మంత్రి తరచుగా మాట్లాడేవారని తెలిపారు. అతనితో మంత్రికి ఏం సంబంధం.. అన్ని సార్లు ఫోన్ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. దీని వెనుక పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు జరిగినట్లు ఆరోపించారు. చైనాలోని వ్యక్తితో పాత నంబర్‌తో మాట్లాడేవారని ఇప్పుడు ఆ నంబర్ ఎందుకు మార్చారంటూ ప్రశ్నించారు. ఆ లావాదేవీలపై విచారణ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. నిరంజన్ రెడ్డిపై ఈడీకి ఫిర్యాదు చేయబోతున్నట్లు వెల్లడించారు.