వైఎస్ విజయమ్మకు తప్పిన పెను ప్రమాదం

ఏపీ సీఎం జగన్ తల్లి విజయమ్మ ప్రయాణిస్తున్న కారు ప్రమదానికి గురైంది. అయితే ఈ ప్రమాదం నుంచి ఆమె క్షేమంగా బయటపడ్డారు. వైఎస్ విజయమ్మ శుక్రవారం ఉదయం ఓ కార్యక్రమం కోసం హైదరాబాద్ నుంచి ఒంగొలు బయలుదేరి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంతమంగలూరు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఒంగోలుకు రోడ్డు మార్గం ద్వారా కారులో విజయమ్మ బయల్దేరారు. మార్గమధ్యలో సంతమాగులూరు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. విజయమ్మ కూర్చున్న వాహనం నడుపుతున్న డ్రైవర్ సడెన్‌ బ్రేక్ వేయడంతో దాని వెనుక వేగంగా వస్తున్న కాన్వాయ్‌లోని కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ఆమె ప్రయాణిస్తున్న కారు వెనుక భాగం దెబ్బతింది.

అయితే ఈ ఘటనలో విజయమ్మకు గానీ, కారులో ప్రయాణిస్తున్న ఇతరులకుగానీ ఎటువంటి గాయాలు కాలేదు. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొద్ది సేపటి తర్వాత అదే కారులో ఆమె ఒంగోలుకు చేరుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతోన్న మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మను విజయమ్మ పరామర్శిచారు. ప్రమాదం విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కుమార్తె షర్మిల.. తమ తల్లికి ఫోన్ చేసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.