నేటి నుండి షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం

హైదరాబాద్: వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఈరోజు నుంచి పునఃప్రారంభం కానుంది. వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలంలోని శంకరం తండా గ్రామం నుండి 3 గంటలకు షర్మిల పాదయాత్ర మొదలుకానుంది. సాయంత్రం శంకరం తండా, లింగగిరి, సూరిపల్లి తండాల మీదుగా నెక్కొండ మండలం వరకు ఆమె పాదయాత్ర సాగనుంది. షర్మిల రాత్రి నెక్కొండలో బస చేయనున్నారు.
చెన్నారావుపేట మండలం లింగగిరి వద్ద గతేడాది నవంబర్ 28న షర్మిల పాదయాత్ర నిలిచిపోయింది. స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డిపై షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు చేయటంతో ఆమె పాదయాత్రను బిఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. షర్మిల ప్రచార రథాన్ని పెద్దిరెడ్డి అనుచరులు దగ్ధం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో పోలీసులు పాదయాత్రకు బ్రేక్ వేశారు.
అనంతరం షర్మిలను అరెస్టు చేసి హైదరాబాద్ తరలించారు. కాగా, ఈ ఏడాది జనవరి 28 నుంచి పాదయాత్ర చేస్తామని, అందుకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్‌ఆర్‌టిపి పోలీసులను పర్మిషన్ కోరగా.. వరంగల్ కమిషనర్ ఫిబ్రవరి 2 నుంచి పాదయాత్రకు షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చారు. అయితే జనవరి 28 నుంచి పాదయాత్ర ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే కొనసాగిస్తామని షర్మిల ఇదివరకే ప్రకటించింది. కానీ అనుమతి లభించకపోవడంతో నేటి నుంచి పాదయాత్ర పునఃప్రారంభిస్తోంది.