జనసేన పార్టీ అభ్యర్థుల్ని ఓడిస్తా అంటున్న మహాసేన రాజేష్

ఎన్నికల పోలింగ్ కు ఐదు రోజులు మాత్రమే ఉండగా..టీడీపీ నేత మహాసేన రాజేష్ కూటమికి షాక్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీకి తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.

‘పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు ఉపసంహరించుకుంటున్నాం.. పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే మా వర్గాలకు జగన్ గారే బెటర్ అనిపిస్తుంది.. వీళ్ళిద్దరికన్నా చంద్రబాబు గారు చాలా చాలా బెటర్.. కులం మతం పేరుతో అమాయకులపై దాడిచేసేవారు ఎవరైనా సరే వారికీ వ్యతిరేకంగా పోరాడమని అంబేద్కర్ గారు చెప్పారు.. పవన్ కళ్యాణ్ గారి వలన జరిగే అనర్ధాలు ప్రజలకు తెలియజేస్తాం.. ఇప్పటికే చాలా సహించాం.. జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లోను ఓడించడానికి రాజ్యాంగ బద్దంగా పనిచేస్తాం.. మాకు రాజకీయాలు, పదవులు ముఖ్యం కాదు.. అన్యాయానికి గురవుతున్న ప్రజల తరపున పోరాడటమే మాకు ఇష్టం.. పదవులు అధికారం కావాలనుకుంటే జగన్ గారితోనే ఉండేవాళ్లం.. పైన ఉన్న నాయకుల్లో నిలకడ లేనపుడు మేము కూడా నిలకడగా ఉండలేము’ అంటూ ఫేస్‌బుక్ వేదికగా పోస్ట్ పెట్టారు.

ఈ ప్రకటన ఫై టీడీపీ శ్రేణులతో పాటు జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజేష్ నిజస్వరూపం ఇది అంటూ వారంతా కామెంట్స్ చేస్తున్నారు.