అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే

సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు

supreme-court-stays-orders-of-ts-high-court-on-ys-avinash-arrest-matter

న్యూఢిల్లీః వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని ఈ నెల 25వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వివేకా కుమార్తె సునీతారెడ్డి వేసిన పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

అయితే, హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తే అవినాశ్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారంటూ ధర్మాసనం దృష్టికి అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాది తీసుకెళ్లారు. అంతేకాదు, ఈ కేసుకు సంబంధించి పేపర్ బుక్ కూడా తమ వద్ద లేదని… సునీత పిటిష్ లో ఏముందో కూడా తమకు తెలియదని… పేపర్ బుక్ తమ వద్ద ఉంటే ఇప్పుడే వాదనలు వినిపించేవాళ్లమని చెప్పారు. సోమవారం వరకు విచారణను వాయిదా వేశారు కాబట్టి, సోమవారం తమ వాదనలను వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో, సోమవారం వరకు అవినాశ్ ను అరెస్ట్ చేయవద్దని సుప్రీం ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించడంతో అవినాశ్ ను అరెస్ట్ చేసేందుకు సీబీఐకి ఫ్రీహ్యాండ్ లభించిందనే చెప్పుకోవాలి. అయితే, సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దని సుప్రీం ఆదేశించడంతో… అవినాశ్ కు స్వల్ప ఊరట లభించినట్టయింది.