హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ గా సికింద్రాబాద్‌ రాంగోపాల్ పేటలోేని దక్కన్ మాల్ బిల్డింగ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గల్లంతైన ఇద్దరి అవశేషాలు కనిపించకపోగా.. ఒకరి అస్ధిపంజరం లభించింది. మంటలను అదుపులోకి తీసుకురావడానికి నాలుగు రోజుల పాటు ఫైర్ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. ఈ ఘటన గురించి ఇంకా నగరవాసులు మాట్లాడుకుంటుండగానే తాజాగా మరో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వీఎస్‌టీలోని అన్నపూర్ణ బార్ సమీపంలోని ఓ గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంతాలకు దట్టమైన పొగ వ్యాపించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. మంటలు రావడంలో స్థానిక గోడౌన్‌కు సమీపంలోని ప్రజలు పరుగులు తీశారు. కొంతమంది ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయడం తో ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే పనిలో అధికారులు ఉన్నారు. షార్ట్ సర్కూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగిందా..? లేక వేరే ఏమైనా కారణం ఉందా? అనే విషయాలపై విచారణ చేపడుతున్నారు.

ఈ ప్రమాద స్థలికి రాష్ట్ర మంత్రి తలసాని చేరుకున్నారు. ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బందిని ఆరా తీశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి తలసాని.. ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన గోదాముల్లో జాగ్రత్తలు తీసుకోని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పురాతన గోదాములు, భవనాలు గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు.