చంద్రబాబు ను కలిసిన షర్మిల

వైస్ షర్మిల..టీడీపీ అధినేత చంద్రబాబు ను కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన షర్మిల… తన కుమారుడి వివాహానికి రావాలని బాబు కుటుంబాన్ని ఆహ్వానించారు. వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిన తర్వాత చంద్రబాబును కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తమ నివాసానికి వచ్చిన షర్మిలను చంద్రబాబు దంపతులు సాదరంగా ఆహ్వానించారు.


“వైఎస్ రాజశేఖరరెడ్డి గారి మనవడు రాజా రెడ్డి పెళ్లి జరుగుతున్న తరుణంలో చాలా మంది రాజకీయ నాయకులను పెళ్లికి ఆహ్వానిస్తున్నాం. ఇందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించాలని కోరడం జరిగింది. చాలాసేపు రాజశేఖరరెడ్డి గురించి, వారి స్నేహం గురించి, వారి రాజకీయ ప్రారంభ దశలో జరిగిన ప్రస్థానం గురించి చంద్రబాబు అన్నీ గుర్తు చేసుకున్నారు. నాకు గుర్తు చేశారు. ఇద్దరం చాలా సేపు మాట్లాడాం. చాలా సంతోషం అనిపించింది. పెళ్లికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదిస్తానని మాట ఇచ్చారు. మా మధ్య చర్చలో ఎక్కువగా రాజశేఖరరెడ్డి గురించే ప్రస్తావించారు. ఇద్దరి ప్రయాణం, జీపులో కలిసి తిరగడం, పొద్దున్నుంచి రాత్రి వరకు కలిసి ఉండటం, ఇద్దరూ ఢిల్లీకి కలిసి వెళ్లడం, సీఎం పదవి కోసం ఇద్దరూ చేసిన ప్రయత్నాలు.. ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారని ‘ షర్మిల తెలిపింది.