కిడ్నాపర్లు అనుకొని సాధువులను చితకబాదారు

పిల్లలను ఎత్తుకెళ్తారనుకొని సాధువులను (Sadhus) చితకబాదిన ఘటన పశ్చిమబెంగాల్‌లోని పురులియా (Purulia) జిల్లాలో జరిగింది. మ‌క‌ర సంక్రాంతి సంద‌ర్భంగా బెంగాల్‌లో గంగ‌సాగ‌ర్ మేళా నిర్వ‌హిస్తారు. ఈ మేళాకు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి ముగ్గురు సాధువులు బెంగాల్‌కు వ‌చ్చారు. అయితే పురులియా జిల్లాలోని కాసీపూర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఆ ముగ్గురు దారి త‌ప్పారు. దీంతో ఓ ఇద్ద‌రు అమ్మాయిలు క‌నిపించ‌గా, గంగ‌సాగ‌ర్ మేళాకు దారేది అని సాధువులు అడిగారు. సాధువుల‌ను చూసి భ‌య‌ప‌డిన అమ్మాయిలు.. స్థానికుల‌కు స‌మాచారం అందించారు.

దీంతో స్థానికులు పిల్లలను కిడ్నాప్‌ చేయడానికి వచ్చారనుకొని సాధువులను వెంబడించి పట్టుకున్నారు. వారిపై దాడిచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని రక్షించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పురూలియా ఎస్పీ అభిజిత్‌ బెనర్జీ చెప్పారు. సాధువులపై దాడిచేసినవారిని గుర్తించామని, వారిని అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు.