ఢిల్లీ చేరుకున్న వైఎస్ షర్మిల..నేడు కాంగ్రెస్ పార్టీలో చేరిక!

ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగించవచ్చంటూ ప్రచారం

YS Sharmila

న్యూఢిల్లీః వైఎస్‌ఆర్‌టిపి అధినేత్రి వైఎస్ షర్మిల ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు (గురువారం) 10.30 గంటలకు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు భర్త అనిల్‌తో కలిసి బుధవారం రాత్రి ఆమె ఢిల్లీ వెళ్లారు. తన చేరికతో వైఎస్‌ఆర్‌టిపిని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ పీసీసీ బాధ్యతలను వైఎస్ షర్మిలకు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్ఠానం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఇందుకు సుముఖంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ నేతలతో జరిగిన సమావేశంలో రాహుల్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పీసీపీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తన అభిప్రాయాన్ని చెబుతుండగా రాహుల్ కలగజేసుకొని ఏపీ కాంగ్రెస్‌లో షర్మిలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పినట్టుగా పేర్కొన్నాయి. మల్లికార్జునఖర్గే వద్ద కూడా రాహుల్ ప్రత్యేకంగా షర్మిల ప్రస్తావన తీసుకొచ్చారని సమాచారం. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఇద్దరు మాజీ ఎంపీలు మినహా అందరూ షర్మిల కాంగ్రెస్‌లో చేరడాన్ని స్వాగతించారని తెలుస్తోంది.