సిఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ ప్రచారం.. వదంతులేనని కొట్టిపారేసిన ఈడీ

ఢిల్లీ సీఎం ఇంటి ముందు రోడ్లు బ్లాక్ చేసిన పోలీసులు

Reports of raids at Arvind Kejriwal’s house rumours: Probe agency ED sources

న్యూఢిల్లీః ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేషనల్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ను ఈరోజు అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులకు స్పందించకపోవడం, విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్టు తప్పదని ఆప్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు చేసి, సీఎంను అదుపులోకి తీసుకుంటారని చెబుతున్నాయి. ఈ ప్రచారం నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటిముందు పోలీసులు సెక్యూరిటీ పెంచారు. ఆయన ఇంటికి వెళ్లే పలు మార్గాలను బ్లాక్ చేశారు. అయితే, ఇదంతా వట్టిదేనని, కేజ్రీవాల్ ను అరెస్టు చేసే ఆలోచన తమకు లేదని ఈడీ అధికారులు చెబుతున్నారు. మూడు నోటీసులకు ఆయన స్పందించకపోవడంతో నాలుగోసారి నోటీసులు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ కు పాల్పడ్డారంటూ సీఎం కేజ్రీవాల్ పై ఈడీ ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారంలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపించింది. అయితే, విచారణకు పిలిచి కేజ్రీవాల్ ను అరెస్టు చేస్తారని ఆప్ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో కేజ్రీవాల్ ఈ నోటీసులను పట్టించుకోలేదు. ఈ నోటీసులు రాజకీయ ప్రేరేపితమని, ఆప్ ను అణిచివేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలని ఆరోపించారు. ఇటీవల మూడోసారి నోటీసులు పంపిన ఈడీ.. ఈ నెల 3న విచారణకు రమ్మంటూ కేజ్రీవాల్ కు సూచించింది. అయినా ఆయన విచారణకు రాలేదు. దీంతో కేజ్రీవాల్ అరెస్టు తప్పదని ప్రచారం జరుగుతోంది.