నేడు రాప్తాడులో సీఎం జగన్ ‘సిద్ధం’ సభ

cm-jagan-siddam-sabha-in-denduluru-today

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ అధినేత, సీఎం జగన్ తన దూకుడు పెంచుతున్నారు. ఓ పక్క అభ్యర్థుల ఎంపిక ఫై కసరత్తులు చేస్తూనే..మరోపక్క ప్రచారాన్ని పెంచుతున్నారు. సిద్ధం పేరుతో గత కొద్దీ రోజులుగా వరుస సభలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఐదేళ్ల లో తమ ప్రభుత్వం చేసిన పనులు , సంక్షేమ పథకాలను వివరిస్తూ..ప్రతిపక్ష పార్టీల ఫై విరుచుకుపడుతున్నారు.

ఈ క్రమంలో ఈరోజు అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ ‘సిద్ధం’ సభ నిర్వహిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ పార్టీ కార్యకర్తలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సభకు రాయలసీమ జిల్లాల నుంచి కార్యకర్తలు భారీగా తరలిరానున్నారని, 250 ఎకరాల మైదానంలో సభ కోసం ఏర్పాట్లు చేసినట్లు స్థానిక నేతలు తెలిపారు. ఇందుకోసం మధ్యాహ్నం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి సీఎం రాప్తాడు చేరుకుంటారు. సభలో ప్రసంగించిన అనంతరం తిరిగి జగన్ తాడేపల్లి చేరుకుంటారు.

ఈసంద‌ర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. బెంగళూరు హైదరాబాద్ 44వ నెంబర్ జాతీయ రహదారి చెన్నై బళ్లారి 42వ నంబర్ జాతీయ రహదారులు ఈ ప్రాంతం నుంచి వెళ్తాయి. దీంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.చెన్నై, కదిరి వైపు నుండీ వయా ఫంగల్ రోడ్డు మీదుగా జాతీయ రహదారి-44 పై హైదరాబాద్ వెళ్లాల్సిన వాహనాలు బత్తలపల్లి వద్ద మళ్లించారు. బత్తలపల్లి నుండీ నార్పల, బుక్కరాయసముద్రం, ఎన్టీఆర్ మార్గ్, గుత్తిరోడ్డు, తడకలేరు, సోములదొడ్డి వద్ద జాతీయ రహదారి-44 మీదుగా వెళ్లాలి.

హైదరాబాద్ నుండీ వయా అనంతపురం మీదుగా కదిరి, చెన్నై వైపు వెళ్లాల్సిన వాహనాలు సోములదొడ్డి వద్ద డైవర్షన్ చేశారు. సోములదొడ్డి నుండీ తడకలేరు, గుత్తిరోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, బుక్కరాయసముద్రం, నార్పల, బత్తలపల్లిల మీదుగా వెళ్లాలి . వాహనాల రాకపోకల మళ్లింపు ప్రారంభపు ప్రదేశాలలో “ట్రాఫిక్ డైవర్షన్” వివరాలను తెలియజేస్తూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. వాహనాల డ్రైవర్లు గమనించి ఫ్లెక్సీలలో సూచించిన ప్రకారం ఆయా రహదారులపై వెళ్లాలి.