నామినేష‌న్ వేసిన పాల్వాయి స్ర‌వంతి

మునుగోడు ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ అభ్యర్థి గా పాల్వాయి స్ర‌వంతి శుక్రవారం నామినేషన్ దాఖలు చేసారు. నామినేషన్ గడువు ఈరోజుతో ముగియనున్న నేపథ్యంలో చివరి రోజు నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు పోటీపడ్డారు. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు పాల్వాయి స్ర‌వంతి తన నామినేషన్ ను దాఖలు చేసారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కీల‌క నేత‌లంతా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

మ‌రోవైపు ప్ర‌జాశాంతి పార్టీలో చేరి ఆ పార్టీ త‌ర‌ఫున మునుగోడు బ‌రిలో దిగేందుకు సిద్ధ‌ప‌డ్డ ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ చివ‌రి నిమిషంలో మ‌న‌సు మార్చుకున్నారు. మునుగోడు బ‌రిలోకి దిగేందుకు గ‌ద్ద‌ర్ నిరాక‌రించ‌డంతో ప్ర‌జాశాంతి పార్టీ త‌ర‌ఫున ఆ పార్టీ అధినేత కేఏ పాల్ స్వ‌యంగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల పర్వం శుక్రవారం మధ్యాహ్నంతో ముగిసింది. దాదాపు 140 వరకు నామినేషన్లు దాఖలుకాగా, 100 మందికిపైగా అభ్యర్థులు నామినేషన్ వేశారు. చివరిరోజైన శుక్రవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17 వరకు గడువు ఉంటుంది. నవంబర్ 3న పోలింగ్ నిర్వహిస్తారు. 6న కౌంటింగ్ జరిపి ఫలితం వెల్లడిస్తారు. టీఆర్ఎస్ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ తరఫున కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరఫున పాల్వాయి స్రవంతి , ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ లు నామినేషన్ దాఖలు చేసారు. అలాగే టీజేఎస్ తరఫున పల్లె వినయ్ కుమార్ నామినేషన్ వేశారు.