వైఎస్సార్‌కు నివాళులర్పించిన సీఎం జగన్‌, కుటుంబ సభ్యులు

YouTube video

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్‌ సమాధి వద్ద కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ వేడుకలను కన్నుల పండుగగా జరుపుకుంటున్నారు.

అలాగే వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకుని ఈరోజు, రేపు వైస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలు మరికాసేపట్లో మొదలుకాబోతున్నాయి. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో ప్లీనరీ నిర్వహించనున్నారు. తొలి రోజు లక్ష మంది, రెండోరోజు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగ సమయానికి 3 నుంచి 4 లక్షల మంది హాజరయ్యేలా జన సమీకరణకు వైస్సార్సీపీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. పార్టీ నియమావళిలో సవరణనూ ప్లీనరీ వేదికగా చేయనున్నారు. పార్టీ గౌరవాధ్యక్ష పదవిని రద్దు చేయడం, సంస్థాగత నిర్మాణంలో మార్పులు వంటివి ఆ సవరణల్లో ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది.

ఇక ప్లీనరీలో పాల్గొనే కార్యకర్త నుంచి అధ్యక్షుడి వరకు ఒకే మెనూ ప్రకారం టిఫిన్లు, భోజనాలు, స్నాక్స్‌ అందించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. వాటిని తయారు చేయడానికి అవసరమైన వంట సామగ్రి, కూరగాయలు, సరుకులను భారీ ఎత్తున సిద్ధం చేశారు. వందేమాతరం గీతాలాపనతో ప్లీనరీ మొదలవుతుంది. ఆ తర్వాత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సీఎం వైఎస్‌ జగన్, నాయకులు పూలమాలలు వేసి, నివాళులు అర్పిస్తారు. ప్రార్థన పూర్తయ్యాక పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటనను సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విడుదల చేస్తారు. ఆ తర్వాత పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభోపన్యాసం చేస్తారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సందేశం ఇస్తారు.