టీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియమకాలకు గ్రీన్ సిగ్నల్

టీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియమకాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మరణించిన ఆర్టీసీ సిబ్బంది కుటుంబంలో అర్హులైన ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సర్క్యులర్ జారీ చేశారు. ‘బ్రెడ్ విన్నర్స్ స్కీమ్’ పేరిట సజ్జనార్ ఈ సర్క్యులర్‌ను ట్విట్టర్లో పోస్టు చేశారు. కొవిడ్ -19 విపత్కర పరిస్థితులు, డీజిల్‌, ఇతర ఖర్చుల పెరుగుదల, ఉద్యోగుల క్రమబద్ధీకరణతో సంస్థకు అదనపు సిబ్బంది అవసరం పెరిగిందని, ఈ మేరకు 2019 నుంచి పెండింగ్‌లో ఉంటూ వస్తున్న కారుణ్య నియామకాలను భర్తీ చేయాలని సంస్థ నిర్ణయించినట్లు స‌జ్జ‌నార్‌ పేర్కొన్నారు.

ఉద్యోగి మరణించిన తేదీ ఆధారంగా సీనియారిటీని అనుసరించి కారుణ్య నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఉద్యోగి కుటుంబ సభ్యుల అర్హతలను అనుసరించి డ్రైవర్‌ గ్రేడ్ – 2, కండక్టర్‌ గ్రేడ్‌-2, ఆర్టీసీ కానిస్టేబుల్‌, శ్రామిక్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. డ్రైవర్లకు రూ.19వేలు, కండక్టర్లకు రూ.17వేలు, ఆర్టీసీ కానిస్టేబుళ్లు, శ్రామిక్‌లకు రూ.15వేల చొప్పున జీతాలు ఇవ్వనున్నారు. కారుణ్య నియామకాలు పొందిన సిబ్బంది మూడేళ్ల పనితీరు ఆధారంగా వారిని రెగ్యులర్‌ చేయనున్నారు. ప‌ర్ఫార్మెన్స్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ నిర్వహించి అందులో 60శాతం మార్కులు సాధించడంతో పాటు, ప్రతి ఏడాది 240 రోజులు పనిచేసిన వారు, ప్రయాణికులతో వారి ప్రవర్తనను ఆధారంగా చేసుకొని రెగ్యులరైజ్‌ చేయనున్నామని తెలిపారు.