తండ్రి మందలించడంతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు

ఇటీవల కాలంలో చిన్న చిన్న వాటికే ఆత్మహత్య లు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు తిట్టారని , పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని , ఫోన్ కొనివ్వలేదని , ప్రేమ విఫలమైందని ఇలా చిన్న చిన్న కారణాలకు మనస్థాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మెదక్ జిల్లా మండలంలోని జానకంపల్లిలో తండ్రి మందలించాడని యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గ్రామంలో విషాదం నింపింది.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… జానకంపల్లికి చెందిన దివిటి షాదుల్​ (22) ను తండ్రి భూమయ్య గురువారం మందలించాడు. దీంతో అదే రోజు ఇంట్లో నుంచి పొలం వద్దకు వెళ్లాడు. స్నేహితుడు కిరణ్​కు ఫోన్​ చేసి పురుగుల మందు తాగానని చెప్పాడు. వెంటనే కిరణ్ షాదుల్ దగ్గరకు చేరుకొని, అతన్ని బైక్​పై స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అనంతరం గ్రామస్తులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకొన్న తల్లిదండ్రులు హాస్పిటల్​కు వెళ్లి, అక్కడ నుంచి హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ, అక్కడ చికిత్సకు డబ్బులు సరిపోని పరిస్థతి ఉండటంతో తిరిగి మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మెదక్​ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై మోహన్​రెడ్డి తెలిపారు.