హైద‌రాబాద్‌లో జాప్‌కామ్ సెంట‌ర్..

అమెరికాకు చెందిన ప్రొడ‌క్ట్ ఇంజినీరింగ్ అండ్ సొల్యూష‌న్స్ కంపెనీ జాప్‌కామ్ గ్రూపు హైద‌రాబాద్‌లో సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే పనిలో బిజీ అయ్యారు. ఇప్పటికే డిస్కవరీ వంటి అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ప్రొడ‌క్ట్ ఇంజినీరింగ్ అండ్ సొల్యూష‌న్స్ కంపెనీ జాప్‌కామ్ గ్రూపు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది.

వాషింగ్ట‌న్ డీసీలో జ‌రిగిన భేటీలో జాప్‌కామ్ వ్య‌వస్థాప‌కుడు, సీఈవో కిషోర్ ప‌ల్ల‌మ్‌రెడ్డితో మంత్రి కేటీఆర్ చ‌ర్చించారు. ట్రావెల్‌, హాస్పిటాలిటీ, ఫిన్‌టెక్‌, రిటేల్ రంగాల్లో కీల‌క‌మైన ఏఐ, ఎన్ఎల్‌పీ ఉత్ప‌త్తుల‌ను జాప్‌కామ్‌ కంపెనీ రూపొందించ‌నున్న‌ది. అమెరికాలోని ప‌లు రాష్ట్రాల్లో జాప్‌కామ్ కంపెనీకి కేంద్రాలు ఉన్నాయి. కాలిఫోర్నియా, టెక్సాస్‌, ఫ్లోరిడాతో పాటు సెంట్ర‌ల్ అమెరికా, ఇండియాలోనూ ఆ కంపెనీకి ఆఫీసులు ఉన్నాయి. హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయ‌నున్న జాప్‌కామ్ కంపెనీ తొలుత 500 మందికి ఉద్యోగాలు క‌ల్పించ‌నున్న‌ది. ఆ త‌ర్వాత ఏడాదిలోగా మ‌రో వెయ్యి మందికి ఉద్యోగాలు క‌ల్పిస్తుంద‌ని మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు.