రంజాన్‌ పండుగ వేళ..కర్నూల్ లో విషాదం

వీధి కుక్కల దాడులు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. చిన్న , పెద్ద అనే తేడాలు లేకుండా అందరిపై దాడి చేస్తున్నాయి. ఇప్పటికే ఎంతోమంది ఈ కుక్కల దాడికి హాస్పటల్ పాలవ్వగా..పలువురు మరణించడం జరిగింది. తాజాగా రంజాన్‌ పండుగ వేళ కర్నూల్ లో విషాదం చోటుచేసుకుంది. వీధి కుక్క దాడికి యువకుడు ప్రాణాలు విడిచాడు.

ఉమ్మడి కర్నూలు జిల్లా బేతంచెర్ల పట్టణానికి చెందిన ఎస్ చిన్న పాంషావలి భార్య ఉమ్మికులం, ఇద్దరు పిల్లలతో కలిసి సంజీవ్ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో ఉంటున్నాడు. పాంషావలి పట్టణానికి సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. ఈ నెల 4న ఫ్యాక్టరీలో ఉండగా ఓ వీధి కుక్క ఒకటి అతడిపై దాడి చేసి కరిచింది. పాంషావలి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడ్ని కర్నూలు పెద్దాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రంజాన్‌ రోజున పాంషావలి చనిపోయాడు. పాంషావలి మరణంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఉమ్మికులం ప్రస్తుతం గర్భవతి, ఆమె బాధకు హద్దలు లేకుండా పోయాయి.