అప్పన్న ఆలయ సిబ్బందిపై శారదాపీఠాధిపతి ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ ఆలయం సింహాద్రి అప్పన్నను విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సిబ్బంది ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. క్యూలైన్లలో భక్తుల అవస్థలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ..గర్భాలయంలో ఆచారాలను మంటగలిపారని మండిపడ్డారు. ఇవన్నీ చూస్తుంటే ఈ రోజు స్వామి వారి దర్శనానికి ఎందుకు వచ్చానా.. అని బాధపడుతున్నానని అన్నారు. పేదల దేవుడి దగ్గర గందరగోళం సృష్టించారని, సామాన్య భక్తులను దేవుడికి దూరం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

సింహాచలం ఆలయానికి ఇప్పటికీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో) లేకపోవడం దారుణమని స్వరూపానందేంద్ర అన్నారు. ఇన్ చార్జి ఈవోతో ఉత్సవాలు జరిపించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఏర్పాట్లు సరిగా లేక సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.

సింహాచలంలో అప్పన్నస్వామి చందనోత్సవం ఆదివారం వైభవోపేతంగా జరిగింది. స్వామిని నిజరూపంలో దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. తెల్లవారుజామునుంచే భక్తులు క్యూ లైన్లకు చేరుకున్నారు. ఉచిత దర్శనం, రూ.300 దర్శనం, రూ.1000, రూ.1500 ప్రత్యేక దర్శనాలతో పాటు వీఐపీ దర్శనానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, లక్షలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి రావడంతో గందరగోళం నెలకొంది. సామాన్య భక్తులను పట్టించుకోకుండా ప్రముఖులకు దర్శనం కల్పించారని, గంటల తరబడి క్యూ కదలడమే లేదని భక్తులు ఆరోపించారు. దేవాదాయ శాఖ అధికారుల తీరుపై మండిపడుతున్నారు.