తెలంగాణ లో నిరంకుశ పాలనకు ముగింపు పలకలంటూ సీఎం యోగి పిలుపు

తెలంగాణ లో నిరంకుశ పాలనకు ముగింపు పలకలంటూ యూపీ సీఎం యోగి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన బిజెపి ప్రజా సంకల్ప సభలో మాట్లాడుతూ.,రాష్ట్రంలో సాగుతున్న నిరంకుశ పాలనకు ముగింపు పలకడంతో పాటు బీజేపీపై జరుగుతున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. యూపీలో డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల సుపరిపాలన సాగుతోందని, కేంద్ర పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయని చెప్పారు.

ఉత్తర్ ప్రదేశ్ లో 6 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల హెల్త్ కవరేజీ అందించడంతో పాటు కరోనా కారణంగా గత 28 నెలలుగా 15 కోట్ల మందికి నెలకు రెండుసార్లు ఫ్రీ రేషన్ అందిస్తున్నట్లు యోగి ప్రకటించారు. బీజేపీ సర్కారు వల్లే యూపీ సుపరిపాలన సాగుతోందని, అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని యోగి చెప్పారు. మాఫియాపై ఉక్కుపాదం మోపడంతో పాటు ప్రభుత్వ ఖజానాను లూటీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తెలంగాణలో బీజేపీ సర్కారు ఏర్పడితే రాష్ట్రాభివృద్ధికి తమ వంతు సాయం అందిస్తామని యోగి హామీ ఇచ్చారు.

ఇక సభలో పాల్గొన్న నేతలంతా కేసీఆర్ , టిఆర్ఎస్ లపై విమర్శలు చేస్తే..విమర్శించాల్సిన అసలు వ్యక్తి ప్రధాని మోడీ మాత్రం సైలెంట్ అయ్యారు. ఊహించని విధంగా స్ట్రాటజీ మార్చిన మోదీ.. ఎలాంటి రాజకీయ విమర్శలు లేకుండా తన స్పీచ్‌ కొనసాగించారు. కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ఊసెత్తకుండా ప్రసంగం చేశారు. కేసీఆర్‌ ప్రశ్నల ప్రస్తావన లేకుండా ప్రసంగం ముగించారు. అభివృద్ధే అజెండాగా ప్రధాని స్పీచ్‌ సాగింది. తెలంగాణకు కేంద్రం చేస్తున్న సాయంపైనే ప్రధాని దృష్టి కేంద్రీకరించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధుల లెక్కలు ప్రధాని వివరించి అందరికి షాక్ ఇచ్చారు.