లోక్‌సభ నుంచి 34 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌

34-opposition-members-suspended-from-lok-sabha

న్యూఢిల్లీః స్పీకర్‌ ఓం బిర్లా లోక్‌సభ నుంచి 34 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేశారు. సభలో గందరగోళం సృష్టించినందుకు కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి సహా 34 మంది ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి సస్పెండ్‌ అయ్యారు. శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్‌ కొనసాగనున్నది. సస్పెండ్ అయిన ఎంపీల్లో అధిర్ రంజన్ చౌదరి, టీఆర్ బాలు, దయా నిధి మారన్ ఉన్నారు. మాణికం ఠాగూర్, కనిమొళి, పీఆర్ నటరాజన్, వీకే శ్రీకందన్, బెన్నీ బహనన్, కే సుబ్రమణ్యం, ఎస్ వెంకటేశన్, మహ్మద్ జావేద్ ఉన్నారు. 31 మంది ఎంపీలను శీతాకాల సమావేశాల వరకు సస్పెన్షన్‌ విధించగా.. మరో ముగ్గురిని ప్రివిలేజెస్‌ కమిటీ నివేదిక ఇచ్చే వరకు సస్పెండ్‌ చేయగా.. కే జయకుమార్‌, విజయ్‌ వసంత్‌, అబ్దుల్‌ ఖలీక్‌ ముగ్గురు స్పీకర్‌ పోడియంపైకి ఎక్కి నినాదాలు చేశారు. ఎంపీల సస్పెన్షన్ ప్రతిపాదనను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సభలో ప్రవేశపెట్టారు.

కాగా, లోక్‌సభలోకి ఇద్దరు యువకులు చొరబడి కలర్‌ స్మోక్‌ను వదిలిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రధాని లేదంటే కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటన చేయాలంటూ విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇందులో భాగంగా సోమవారం సైతం సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. భద్రతా వైఫల్యంపై చర్చకు పట్టుబట్టాయి. ఈ క్రమంలో లోక్‌సభతో పాటు రాజ్యసభ పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. భద్రతా వైఫల్యంపై రాజకీయం చేయడం శోచనీయమని స్పీకర్‌ ఓం బిర్లా అన్నారు. వెల్‌లోకి వచ్చి నినదించడం సభా మర్యాదలకు విరుద్ధమన్నారు. కీల‌క‌మైన అంశాల‌పై చ‌ర్చ చేప‌ట్టేందుకు ప్రతిపక్షాల స‌హ‌కారం అవ‌స‌రమ‌ని ఓం బిర్లా అన్నారు. ఘటనపై విచార‌ణ జరుగుతుందని.. ద‌ర్యాప్తు ఏజెన్సీలు ఆ వ్యవహారాన్ని తేలుస్తాయన్నారు.