శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది

శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుండి నల్గొండకు వస్తుండగా రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద కాన్వాయ్ లోని కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న కారు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో… ఆ కారును అనుసరిస్తూ వస్తున్న మరో నాలుగు కార్లు ఒకదాన్నొకటి గుద్దుకున్నాయి. ఐతే ప్రమాదం నుంచి గుత్తా క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాన్వాయ్ లోని మూడు కార్లు స్వల్పంగా దెబ్బతినడంతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హైదరాబాద్ కు తిరిగి వెళ్లిపోయారు.

ఇక గుత్తా రాజకీయ విషయానికి వస్తే..గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని క‌మ్యూనిస్టు పార్టీ నుంచి ప్రారంభించారు. క‌మ్యూనిస్టు పార్టీలో చురుకుగా ప‌ని చేసిన ఆయ‌న‌.. అంచెలంచెలుగా ఎదిగారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో ప‌ని చేశారు. 2004 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున న‌ల్ల‌గొండ పార్ల‌మెంట్ స్థానం నుంచి గెలుపొందారు. 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌పున అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌ళ్లీ ఎంపీగా విజ‌యం సాధించారు. 2014 జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్‌లోనూ ఎంపీగా గెలుపొంది.. 2016, జూన్ 15న టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో గుత్తాను సీఎం కేసీఆర్ రైతు స‌మ‌న్వ‌య స‌మితి రాష్ట్ర అధ్య‌క్షుడిగా నియ‌మించారు.

2019, ఆగ‌స్టులో ఎమ్మెల్యే కోటాలో తొలిసారిగా మండ‌లికి ఎన్నిక‌య్యారు. ఈ క్ర‌మంలో రైతు స‌మ‌న్వ‌య స‌మితి అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేశారు. 2019, సెప్టెంబ‌ర్ 11న మండ‌లి చైర్మ‌న్‌గా ఏక‌గ్రీవంగా ఎన్నియ్యారు. 2021, జూన్ 3న గుత్తా సుఖేందర్ రెడ్డి పదవీకాలం ముగిసింది. 2021, న‌వంబ‌ర్‌లో జ‌రిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మ‌రోసారి గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. ఈ నేప‌థ్యంలో రెండోసారి ఆయ‌న‌ను మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌వి వ‌రించింది.