చంద్రబాబు అరెస్ట్ ఫై వైసీపీ నేతల స్పందన

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ను స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో అరెస్ట్‌ చేసింది ఏపీ సీఐడీ. శనివారం ఉదయం నంద్యాలలో హైడ్రామా తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం విజయవాడలో 3వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో ఆయన్ను హాజరుపరచనున్నారు. ఈ తరుణంలో చంద్రబాబు అరెస్ట్ ఫై వైస్సార్సీపీ నేతలు స్పందిస్తూ వస్తున్నారు.

రాష్ట్రంలోని లక్షలాది మంది పిల్లలకు, యువతకు ఉపాధి చూపించేందుకు ఉపయోగించాల్సిన నిధులను చంద్రబాబు నాయుడు దోపిడీ చేశాడని, ఎంత అనుభవం ఉన్నా సరే.. చేసిన తప్పులకు శిక్ష తప్పదని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. అనుభవం ఉంద‌ని, అవినీతికి ఆమడ దూరంలో ఉంటానని చెప్పుకుని తిరుగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు పాపం పండి.. అవినీతి డొంక కదిలింద‌న్నారు. ఇక ఆయన శేష జీవితం జైలు పాలేనని గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.

అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్ర‌జా ధ‌నాన్ని లూటీ చేసిన చంద్ర‌బాబు నాయుడి పాపం పండింద‌ని, అవినీతి కేసుల్లో చంద్ర‌బాబు ఎప్పుడో అరెస్టు కావాల్సింద‌ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి ర‌మేష్ అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు ఈ రాష్ట్రానికి శుభ పరిమాణమ‌ని చెప్పారు.

స్కిల్‌ స్కామ్‌లో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయి చంద్రబాబు అరెస్టు అయ్యారని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని రూ.371 కోట్ల ప్రజాధనాన్ని షెల్‌ కంపెనీలకు తరలించి లూటీ చేశాడని విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పకడ్బందీగా ప్లాన్‌ చేసిన స్కామ్‌ కేసులోనే చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశార‌ని వైస్సార్సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టులో అసలు విషయం పక్కకు వెళ్లేలా టీడీపీ నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని ఆయ‌న‌ మండిపడ్డారు.. చంద్రబాబు అరెస్ట్‌లో ఎలాంటి దురుద్దేశాలు లేవు.. బలమైన ఆధారాలతోనే సిట్ వేశాం.. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం ఎంతో సంయమనంతో ఉందన్నారు.. దర్యాప్తు సంస్థలు ఎంతో స్వేచ్చగా దర్యాప్తు చేస్తున్నాయన్నారు.