జీ20 విందు.. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయకూడదుః ఖర్గే

not-invited-to-g20-dinner-mallikarjun-kharge-says-shouldn’t-have-done-politics

న్యూఢిల్లీః భారత్‌ అధ్యక్షతన దేశరాజధాని ఢిల్లీలో జరుగుతున్న జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి డిన్నర్‌ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ విందుకు దేశంలోని అన్ని పార్టీల నేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు వెళ్లాయి. మాజీ ప్రధానులు మ‌న్మోహ‌న్ సింగ్‌, హెచ్‌డీ దేవ‌గౌడ‌ల‌కు కూడా ఆహ్వానం అందించింది. అయితే, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కు మాత్రం ఇప్పటి వరకూ ఆహ్వానం అందలేదు. దీనిపై కాంగ్రెస్‌ సహా విపక్షాలు మండిపడుతున్నాయి.

తాజాగా ఈ అంశంపై ఖర్గే మౌనం వీడారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయకూడదంటూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ప్రత్యక్ష దాడికి దిగారు. ఢిల్లీలో నేడు జరిగే జీ20 విందుకు ఆహ్వానం అందకపోవడంపై ఖర్గే మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటికే దీనిపై స్పందించాను. మా పార్టీ స్పందించింది. ఇలా చేయడం మంచి పద్దతి కాదు. వారు (బిజెపి) ఇలాంటి నీచ రాజకీయాలు చేయకూడదు’ అని వ్యాఖ్యానించారు.

కాగా, ఈ విందుకు దేశంలోని అన్ని రాష్ట్రాల‌కు చెందిన ముఖ్యమంత్రుల‌కు కూడా ఆహ్వానం వెళ్లింది. ప్రతిప‌క్ష పాలిత రాష్ట్రాల‌కు కూడా ఆహ్వానం వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. బీహార్ సీఎం నితీశ్ కుమార్‌తో పాటు ఇండియా కూట‌మిలో ఉన్న త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్‌, బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌, పంజాబ్ సీఎం భ‌గ‌వంత్‌మాన్ సింగ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌లకు ఆహ్వానం అందించింది. వీరిలో కొందరు నేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. కాగా, దేవగౌడకు ఆహ్వానం అందినప్పటికీ ఆయన విందుకు దూరంగా ఉండనున్నారు. అనారోగ్య కారణాల వల్ల విందుకు హాజరుకావడం లేదని ఆయనే ట్విట్టర్‌ ద్వారా స్వయంగా వెల్లడించారు.