మోడీ మద్దతు కోరిన యశ్వంత్ సిన్హా..

జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రప‌తి ఎన్నికల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో దేశ రాజ‌ధాని ఢిల్లీలో రాజ‌కీయ వేడి రాజుకుంది. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో విప‌క్షాల‌న్నింటి త‌ర‌ఫున ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీగా కొన‌సాగుతున్న య‌శ్వంత్ సిన్హా ఎంపిక‌య్యారు. ఈ క్రమంలో రాష్ట్రపతి అభ్యర్థులు మద్దుతు కోరే పనిలో ఉన్నారు. ఎన్డీయే తరపున ద్రౌపతి ముర్ము, విపక్షాల తరపున యశ్వంత్ సిన్హా ఎన్నికల బరిలో నిలిచారు. ఇప్పటికే ద్రౌపతి ముర్ము నామినేషన్ దాఖలుచేసింది. ఈ క్రమంలో ఇరు అభ్యర్థులు వివిధ పార్టీల అధినేతలతో మాట్లాడుతూ మద్దతివ్వాలని కోరుతున్నారు.

ఈ తరుణంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తనకు మద్దతివ్వాలని కోరుతూ ప్రధాని మోడీకి విపక్షాల అభ్యర్థి సిన్హా ఫోన్ చేశారు. మోడీతో పాటు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ లకు కూడా ఆయన ఫోన్ చేసి మద్దతు కోరారు. మరోవైపు ముర్ముకు మద్దతు ప్రకటించాలనే యోచనలో సొరేన్ ఉన్నట్టు తెలుస్తోంది. ముర్ము, సొరేన్ ఇద్దరూ సంతాల్ అనే ఒక గిరిజన తెగకు చెందిన వారు కావడం గమనార్హం. మరోవైపు జేడీఎస్ కూడా ముర్ముకు మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. సమాజ్ వాది పార్టీ మాత్రం యశ్వంత్ సిన్హాకు మద్దతిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఏపీలోని వైస్సార్సీపీ ఇప్పటికే ద్రౌపతి ముర్ము కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.