బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌కు జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై..తీహార్ జైల్లో ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. కవిత రిమాండ్‌ను పొడిగించాలంటూ ఈడీ చేసిన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు రిమాండ్ ను మరో 14 రోజుల పాటు పొడిగించింది. 14 రోజుల క‌స్ట‌డీ ముగియ‌డంతో అధికారులు ఆమెను న్యాయ‌స్థానంలో హాజ‌రుప‌రిచారు. ఢిల్లీ మ‌ద్యం విధానం మ‌నీలాండ‌రింగ్ కేసు ద‌ర్యాప్తు కొన‌సాగుతోంద‌ని, క‌విత బ‌య‌ట ఉంటే ద‌ర్యాప్తును ప్రభావితం చేస్తార‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ వాద‌న‌లు వినిపించింది. జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీని మ‌రో 14 రోజులు పొడిగించాల‌ని కోరింది. మ‌రోవైపు క‌స్ట‌డీ పొడిగింపు కోరేందుకు ఈడీ వ‌ద్ద కొత్త‌గా ఏమీ లేద‌ని క‌విత త‌ర‌పు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న కోర్టు.. జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీని పొడిగిస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది.

కవితతో రెండు నిమిషాలు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె తరుఫు లాయర్ జడ్జిని కోరారు. కవిత లాయర్ విజ్ఞప్తిని జడ్జి తిరస్కరించారు. నిందితురాలు నేరుగా మాట్లాడే హక్కు ఉంటుందన్న కవిత తరపు న్యాయవాది వాదించగా.. అప్లికేషన్ ఇవ్వాలని జడ్జి కావేరి బవేజా సూచించారు. దీంతో కోర్టులో హాలులో భర్త, మామను కలిసేందుకు కవిత తరుఫు న్యాయవాదులు అప్లికేషన్ ఇచ్చారు. జడ్జి అనుమతితో కోర్టు హాలులో కవితను ఆమె భర్త అనిల్, మామ రామకిషన్‌రావు కలిశారు.