దామెర రాకేష్ అన్న కు ప్రభుత్వం ఉద్యోగం ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటన

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో చేపట్టిన ఆందోళనలో దామెర రాకేష్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ కుటుంబ సభ్యులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంది. రూ.25 లక్షల ఎక్స్‌‌గ్రే‌షి‌యా‌తో‌పాటు, ఆయన కుటుం‌బంలో అర్హు‌లై‌న‌వా‌రికి తగిన ప్రభు‌త్వ ఉద్యోగం ఇవ్వ‌ను‌న్నట్టు ప్రక‌టిం‌చిన ముఖ్యమంత్రి కేసీఆర్..ప్రకటించినట్లుగానే ఇప్పుడు రాకేష్ అన్న దామెర రామ్ రాజుకు ఉద్యోగం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

దామెర రాజు విద్యార్హతలకు అనుగుణంగా వరంగల్ జిల్లాలో తగిన జాబ్ ఇవ్వాల‌ని వరంగల్ జిల్లా కలెక్టర్ ను ఆదేశిస్తూ ఉత్తర్వులో పేర్కొన్నారు. కారుణ్య నియామ‌కం కింద వ‌రంగ‌ల్‌ జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులో నియమించబోతున్నారు. సైని‌కు‌లపై, వారి కుటుం‌బాల పట్ల ముఖ్య‌మంత్రి అవ్యా‌జ‌మైన అభి‌మా‌నాన్ని చాటు‌కో‌వడం ఇదే మొద‌టి‌సారి కాదు. గతంలో గల్వాన్‌ లోయలో చైనా కుట్రకు బలై‌పో‌యిన కర్నల్‌ సంతో‌ష్‌‌బాబు కుటుం‌బాన్ని ఆదు‌కో‌వ‌డమే కాకుండా.. ఆయన భార్యకు గ్రూప్‌ 1 ఉద్యో‌గాన్ని ఇచ్చిన సంగతి తెలి‌సిందే అంతే‌కా‌కుండా గల్వాన్‌ లోయలో అమ‌రు‌లైన ఇతర రాష్ట్రాల జవాన్ల కుటుం‌బా‌లను సైతం ఆదు‌కొ‌న్నారు. స్వయంగా జార్ఖండ్‌, చండీ‌గఢ్‌ ప్రాంతా‌లకు వెళ్లి.. అమ‌రుల కుటుం‌బా‌లకు ఆర్థిక సహాయం అందించారు. అమర జవాన్ల కుటుం‌బా‌లకు ఇతర రాష్ట్రాలూ సహాయం చేశాయి.

వ‌రంగ‌ల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం మారుమూల డబీర్‌పేట గ్రామానికి చెందిన దామెర కుమార స్వామి, పూలమ్మ దంప‌తుల కొడుకు రాకేశ్ (21) హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్‌)లో పనిచేస్తున్న తన అక్క సంగీత నుంచి ప్రేరణ పొంది ఆర్మీలో చేరాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు. దామెర రాకేశ్‌..రెండుసార్లు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలకు హాజరయ్యాడు. చిన్న కార‌ణం వ‌ల్ల ఉద్యోగం కోల్పోయాడు. అయినా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా మ‌ళ్లీ ప్ర‌య‌త్నించాడు. ఇటీవలే ఫిజికల్ టెస్ట్‌లలో ఉత్తీర్ణత సాధించాడు. ఎంపిక ప్రక్రియ కోసం వేచి చూస్తున్నాడు. అయితే అగ్నిపథ్ స్కీం ద్వారానే రిక్రూట్‌మెంట్‌ జరుగుతుందని తెలియగానే తీవ్ర మనస్తాపానికి గుర‌య్యాడు. హన్మకొండకు చెందిన మరో 14 మందితో కలిసి నిర‌స‌న తెలిపేందుకు హైద‌రాబాద్‌కు చేరుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో ఆర్పీఎఫ్ పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పాయాడు.