అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజీనామా

అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజీనామా చేశారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడం చాలా బాధగా ఉందని.. ఎన్టీఆర్ పేరు తొలగించడం సరైన నిర్ణయం కాదు అన్నారు. అందుకే పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు ఫై విమర్శలు చేసారు లక్ష్మీ ప్రసాద్. టీడీపీ సిద్ధాంతాలకు విరుద్ధంగా చంద్రబాబు వెళ్తున్నారని లక్ష్మీ ప్రసాద్ అన్నారు. వైస్రాయ్ హోటల్ ఘటన తర్వాత టీడీపీని నడిపించే శక్తి చంద్రబాబుకే ఉందని తాను ఆనాడే చెప్పానని, ఇప్పుడు కూడా అదే చెపుతున్నానని తెలిపారు.

అయితే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందని… అలాంటి కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ తన వారసులను రాజకీయాల్లోకి తీసుకురాలేదని… కానీ, చంద్రబాబు తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారని అన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చేందుకు అప్పటి ప్రధాని వాజ్ పేయి సిద్ధంగా ఉంటే… చంద్రబాబు వద్దన్నారని తెలిపారు. ఎన్టీఆర్ కు భారతరత్న వస్తే క్రెడిట్ లక్ష్మీపార్వతికి వస్తుందని ఆయన భావించారని తెలిపారు. అలాగే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టేందుకు కేంద్రం అనుమతిచ్చినప్పటికీ, చంద్రబాబు ఆ పేరు పెట్టకుండా కుట్ర పన్నారన్నారు.

వైఎస్సార్ పేరు పెట్టడం పట్ల అభ్యంతరం లేదు కానీ.. ఎన్టీఆర్ పేరు తొలగించడం సరైన నిర్ణయం కాదు అన్నారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నారని.. ఆ సమయంలో సహాయం కోసం తాను వైఎస్సార్ దగ్గరకు వెళ్తే సహాయం చేశారన్నారు. ఆ కేసులో తనపై ఒత్తిడి వచ్చినా వైఎస్సార్ లొంగలేదని.. చంద్రబాబుపై తనది సైద్ధాంతిక విరోధమే తప్ప వేరే ఏమీ లేదు అన్నారు. మద్రాస్, హైదరాబాద్ అబిడ్స్‌లో ఎన్టీఆర్ నివాస గృహాలను నిర్లక్ష్యం చేసి అమ్మివేసింది చంద్రబాబు, టీడీపీలే అన్నారు. బంజారాహిల్స్‌లో ఎన్టీఆర్ చనిపోయిన గృహాన్ని పడేసి అపార్ట్మెంట్‌లు కట్టడం కన్నా విషాదం ఏమైనా ఉందా అన్నారు.