ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు ఆందోళలన్లు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును.. ‘వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ’గా మార్చడం ఫై టీడీపీ నేతలు , కార్య కర్తలు , నందమూరి అభిమానులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. మరోపక్క బిజెపి నేతలతో పాటు పలువురు సీనియర్ నేతలు సైతం వైస్సార్సీపీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

వర్సిటీ పేరు మార్పును వ్యతిరేకిస్తూ బెజవాడ ఎంపీ కేశినేని నాని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 1986కు పూర్వం ఆంధ్రప్రదేశ్‌లో హెల్త్ యూనివర్సిటీ అనే కాన్సెప్ట్ లేదన్నారు. మెడికల్ కాలేజీలు యూనివర్సిటీలకు అనుసంధానంగా ఉండేవని తెలిపారు. రాష్ట్రం లో హెల్త్ ఎడ్యుకేషన్ బాగుపరచాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామారావు మదిలోని ఆలోచనకి వాస్తవ రూపమే హెల్త్ యూనివర్సిటీ అని నాని పోస్ట్ చేసారు. ఎన్టీఆర్ మరణం తరువాత 1998 ఆయన ఆలోచనకు ప్రతి రూపమైన హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా అప్పటి ప్రభత్వం పేరు పెట్టిందని గుర్తుచేశారు. 1986లో విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీని స్టేట్ గవర్నమెంట్ తీసుకొని హెల్త్ యూనివర్సిటీగా మార్చటం జరిగిందని తెలిపారు. తరువాత మళ్ళీ సిద్ధార్ధ వారు గన్నవరం దగ్గర వేరే మెడికల్ కాలేజ్ స్థాపించారన్నారని… కాబట్టి హెల్త్ యూనివర్సిటీకి రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ పేరును కొనసాగించడం వందశాతం కరెక్ట్ అని స్పష్టం చేశారు.

అలాగే ఎన్టీఆర్‌ వర్సిటీ పేరు మార్పు నిర్ణయం దురదృష్టకరం అని తులసిరెడ్డి అన్నారు. ఇప్పటికే వైఎస్సార్‌ పేరు మీద చాలా ఉన్నాయి. కావాలంటే కొత్తవాటికి వైఎస్సార్‌ పేరు పెట్టుకోవచ్చు. ప్రస్తుత నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి అని తులసిరెడ్డి డిమాండ్ చేసారు. ఎన్టీఆర్‌ చొరవతో ఏర్పాటైన వర్సిటీకి అదే పేరు కొనసాగించాలని వల్లభనేని వంశీ అన్నారు. వంశీమహనీయుడు ఎన్టీఆర్‌ పేరే కొనసాగించే అవకాశం పరిశీలించాలి అని ప్రభుత్వాన్ని వంశీ కోరారు. మరోపక్క గుంటూరు అంబేడ్కర్ కూడలి వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసారు.

అలాగే ఎమ్మెల్యే చిన్న రాజ‌ప్ప మాట్లాడుతూ.. సీఎం జ‌గ‌న్ తుగ్ల‌క్ చ‌ర్య‌లు తీసుకుంటున్నారని, వాటిని అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. ఎన్‌టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు మార్పు చేయ‌డం జ‌గ‌న్ నిరంకుస‌త్వానికి ప‌రాకాష్ట‌ అన్నారు. 25 ఏళ్లుగా కొనుసాగుతున్న పేరును… ఇప్పుడు ఎందుకు మార్చాల్సివ‌స్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.