పెను ప్రమాదం నుండి తప్పించుకున్న యండమూరి వీరేంద్రనాథ్‌

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కు పెను ప్రమాదం తప్పింది. బుధువారం యండమూరి హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తుండగా.. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి శివారులో రాజీవ్‌ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న కారును గోదావరిఖని డిపో బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం దెబ్బతిని, టైరు పగిలిపోయింది. కారులో ప్రయాణిస్తున్న యండమూరి, డ్రైవర్‌.. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

ఇక యండమూరి విషయానికి వస్తే.. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14, 1948లో జన్మించాడు. తండ్రి ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం చేస్తుండటం వల్ల ఉద్యోగ రీత్యా అనేక ప్రదేశాలు తిరిగాడు. అందువల్ల ఆయన బాల్యం అనేక ప్రాంతాల్లో గడిచింది. ప్రాథమిక విద్య కాకినాడ, రాజమండ్రి ల లోనూ, ఆరవ తరగతి జమ్మలమడుగు లోనూ, ఏడవ తరగతి అనంతపురం లోనూ, ఎనిమిది, తొమ్మిది తరగతులు ఖమ్మం లోనూ, పదో తరగతి, ఇంటర్మీడియట్ హైదరాబాద్ లోనూ, బి.కాం కాకినాడ లోనూ చదివాడు. 1972లో సీ.ఏ. పట్టా పుచ్చుకున్నాడు. ఆ తర్వాత నవల రచయితగా ఎన్నో పుస్తకాలు , నవలలు రచించారు. పలు సినిమాలకు కూడా వర్క్ చేయడం జరిగింది.