టీ వ‌ర్క్స్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

దేశంలో ఫస్ట్ టైం అతిపెద్ద ప్రొటోటైపింగ్‌ కేంద్రంగా ఏర్పాటు చేసిన టీ–వర్క్స్‌ను బుధువారం రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్, ఫాక్స్‌ కాన్‌ సంస్థ ఛైర్మన్‌ యంగ్‌ లియూ కలిసి ప్రారంభించారు. రాయదుర్గం ఐటీ కారిడార్‌లో ఒకే చోట సుమారు 18 ఎకరాల్లో టీ-హబ్‌, టీ-వర్క్స్‌, ఇమేజ్‌ టవర్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. సంకలిత ప్రోటో టైపింగ్, ఎలక్ట్రానిక్స్ వర్క్‌స్టేషన్, ఫినిషింగ్ షాప్, లేజర్ కటింగ్, పీసీబీ ఫాబ్రికేషన్, కుండల తయారీ, ప్రీ–కంప్లైయన్స్, మెటల్‌ షాప్‌ వంటి అత్యాధునిక సాంకేతికతలు ఇక్కడ అందుబాటులో ఉంచారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కర్తలకు అండగా నిలిచేందుకు దేశంలో తొలిసారి ‘టీ–వర్క్స్’ కేంద్రం ఏర్పాటు చేశారు.

ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ..ఐటీ అంటే ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ కాదు.. ఐ అంటే ఇండియా, టీ అంటే తైవాన్ అని నిర్వ‌చించారు. సాఫ్ట్‌వేర్‌కు ఇండియా ప‌వ‌ర్ హౌస్ లాంటింద‌ని పేర్కొన్నారు. తైవాన్ దేశం హార్డ్ వేర్ రంగంలో సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది అని గుర్తు చేశారు. రెండు దేశాలు క‌లిసి ప‌ని చేస్తే ప్ర‌పంచానికి చాలా ఇవ్వొచ్చు అని ఆయ‌న అన్నారు. సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో ఈ ఎనిమిదిన్న‌రేండ్ల‌లో తెలంగాణ ఎన్నో విజ‌యాలు సాధించింద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే ఎన్నో పెట్టుబ‌డులు తెలంగాణ‌కు త‌ర‌లిరాగా, తాజాగా ఫాక్స్ కాన్ పెట్టుబ‌డులు పెట్ట‌డం, ల‌క్ష మందికి ఉద్యోగ క‌ల్ప‌న చేస్తామ‌ని ప్ర‌క‌టించినందుకు యంగ్ లియూకు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.

టీ వ‌ర్క్స్‌ను చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యాను అని ఫాక్స్ కాన్ చైర్మ‌న్ యంగ్ లీయు తెలిపారు. హైద‌రాబాద్‌ తో పాటు తెలంగాణ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది అని పేర్కొన్నారు. ఇదే వేగంతో ప‌ని చేస్తే రాబోయే నాలుగేండ్ల‌లో డ‌బుల్ రెవెన్యూ సాధించడం ఖాయ‌మ‌న్నారు. టీ వ‌ర్క్స్‌కి ఎస్ఎంటీ యంత్రాన్ని త్వ‌ర‌లోనే అందిస్తాం అని ఫాక్స్ కాన్ చైర్మ‌న్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ ముఖ్య కార్యద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్, టీ వ‌ర్క్స్ సీఈవో సంజ‌య్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో పాటు ప‌లువురు పాల్గొన్నారు.