జగన్‌కు అప్పులపై ఉన్న శ్రద్ధ బీసీలపై లేదుః యనమల

పులివెందులలోనూ టిడిపిదే విజయమని ధీమా

yanamala ramakrishnudu
yanamala ramakrishnudu

అమరావతిః దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ బీసీ గణన చేపడుతుంటే ఏపీలోని జగన్ ప్రభుత్వం మాత్రం ఆ పనిచేయకుండా బీసీలకు తీరని ద్రోహం చేస్తోందని టిడిపి సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలే బీసీ జనగణన చేయొచ్చని పాట్నా హైకోర్టు కూడా చెప్పిందన్నారు. అయినా జగన్ మౌనం వీడడం లేదని, బీసీలంటే ఆయనకెందుకు అంత కక్ష అని ప్రశ్నించారు. జగన్‌కు అప్పులపై ఉన్న శ్రద్ధ బీసీలపై లేదన్నారు. 151 మంది వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేల్లో 140 మంది అవినీతిపరులేనని ఏడీఆర్ నివేదిక చెబుతోందని విమర్శించారు. దేశంలోని ధనిక ఎమ్మెల్యేలు కూడా వైఎస్‌ఆర్‌సిపి వారేనని పేర్కొన్నారు.

నేరాలు, ఘోరాలు, విధ్వంసాలతో వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి సొమ్ముతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయకుండా ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగాలని కోరారు. అణగారిన వర్గాల చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందన్నారు. పులివెందులలోనూ టిడిపి విజయం సాధిస్తుందని నిన్నటి చంద్రబాబు సభతో తేలిపోయిందని యనమల పేర్కొన్నారు. జగన్ సొంత జిల్లాలోనే చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం చూస్తుంటే జగన్‌పై అక్కడి ప్రజలలో ఉన్న వ్యతిరేకత ఏపాటిదో అర్థమవుతోందన్నారు. బాదుడే బాడుడుతో తాడేపల్లి ప్యాలెస్ నింపుకునేందుకు ప్రజల రక్తాన్ని పీల్చుతున్నారని ఆరోపించారు. జ‌గ‌న్ ప్రసంగిస్తున్న స‌మయంలోనే స‌భ‌కు హాజ‌రైన వారు మ‌ధ్యలోనే లేచి వెళ్లిపోవడం దేనికి సంకేతమని యనమల ప్రశ్నించారు.