ఈనెల 25న యాదాద్రి ఆలయం మూసివేత

ఈ నెల 25న సూర్య గ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఆ రోజు ఉదయం 8:50 గంటల నుంచి 26 ఉదయం 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. దీనిని భక్తులు గమనించగలరని పేర్కొన్నారు. 25వ తేదీన నిత్య, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం రద్దు చేయనున్నారు. 26న నిర్వహించే శత ఘట్టాభిషేకం, సహస్రనామార్చనను రద్దు చేశారు. 26న సంప్రోక్షణ నిర్వహించి 10:30 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. ఆ తర్వాత యాథావిధిగా నిత్య కైంకర్యాలు మొదలు కానున్నాయి.

ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఇదే. 27 ఏళ్ల తర్వాత దీపావళి రోజునే సూర్యగ్రహణం ఏర్పడడం విశేషం. పాక్షికంగా ఏర్పడనున్న ఈ గ్రహణం యురోపియన్ కంట్రీస్, పశ్చిమ సైబీరియా, మధ్య ఆసియా, పశ్చిమ ఆసియా, ఈశాన్య ఆఫ్రికా ప్రాంతాలతో పాటు మనదేశంలో కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ పాక్షిక సూర్యగ్రహణం ఢిల్లీ లో కనిపించనుంది. తిరుమల ఆలయం రెండు రోజుల పాటు మూసివేస్తున్నారు. ఈ నెల 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయబోతున్నారు. గ్రహణాలు సంభవించే ఈ రెండు రోజుల పాటు స్వామివారి దర్శనాలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన వెల్లడించింది. గ్రహణాల రోజున 12 గంటలపాటు ఆలయం మూసివేయనున్నట్టు తెలిపింది. ఆ సమయంలో ఎలాంటి దర్శనాలకు అనుమతించబోమని భక్తులు దీనిని గమనించగలరని పేర్కొంది.