మునుగోడు చల్మెడ చెక్ పోస్ట్ వద్ద..కోటి రూపాయిలను పట్టుకున్న పోలీసులు

మునుగోడు లో విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని అన్ని ప్రధాన పార్టీలు శ్రమిస్తున్నాయి. ఇదే క్రమంలో డబ్బును కూడా భారీగా ఖర్చు చేస్తున్నారు. ప్రతి రోజు వెంట నడిచే కార్య కర్తలకు రోజు వెయ్యి రూపాయలకు వరకు ఇస్తూ మందు , బిర్యానీ ఇలా అన్ని ఇస్తూ బంగారంలా చూసుకుంటున్నారు. అంతే కాదు ఓటర్లను కూడా దేవుడిలా చూసుకుంటున్నారు. వారు ఏంకావాలంటే అవి అందజేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మునుగోడు మండలం చల్మెడ చెక్ పోస్ట్ వద్ద భారీగా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మునుగోడు మండలం చల్మెడ చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా కార్ కనిపించడం తో దానిని ఆపి చెక్ చేయగా..అందులో కోటి రూపాయిలు లభ్యం అయ్యాయి. ఈ కారు బీజేపీకి చెందిన ఓ నేత వాహనమని గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. మునుగోడులో పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న సమయంలో.. ధన ప్రవాహం పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తూ.. ధన ప్రవాహానికి చెక్ పెడుతున్నారు. అయితే.. ఒకే కారులో కోటి రూపాయలు దొరకడం చర్చనీయాంశమైంది. స్వాధీనం చేసుకున్న డబ్బును.. ఎన్నికల కోసం తీసుకొస్తున్నారా.. లేక వేరే ఏదైనా పనికోసం తీసుకొచ్చారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.