బతుకమ‍్మ చీరలపై మహిళలు ఆగ్రహం..

బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలందరికీ తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలను అందిస్తుంది. బతుకమ్మ పండుగ నేపథ్యంలో తెలంగాణ ఆడబిడ్డలను గౌరవించుకునే సంప్రదాయం తెలంగాణలో తరతరాలుగా కొనసాగుతూవస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి, ప్రతిఏటా ప్రభుత్వం తరపున బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని హిందూ, ముస్లిం, క్రైస్తవులతో పాటు అన్ని కులాలు, అన్ని మతాల పేద మహిళలందరికీ బతుకమ్మ కానుకను అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అలోచనలోంచి ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. మొదట్లో 30 డిజైన్ల చీరలతో ప్రారంభమైన బతుకమ్మ చీరల పంపిణీ 225 డిజైన్లకు చేరుకుంది. కాగా ఈ ఏడాది ప్రతి ఏడాది మాదిరిగానే బతుకమ్మ చీరలను పంపిణి చేసింది.

అయితే బతుకమ‍్మ చీరలపై మహిళా నుండి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ఆర్భాటంగా పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ మహిళలు.. వాటిని తీసుకునేందుకు కూడా ఆసక్తి చూపించటం లేదు. నేతలు తీసుకోండని ఎంత బ్రతిమలాడిన వాటిని తీసుకునేందుకు కాదు కదా కనీసం తీసుకున్నట్టు ఫొటోకు ఫోజు ఇవ్వమని ఇవ్వడం లేదు. ఆ పైగా ఆ చీరలను చింపేస్తూ, కాల్చేస్తూ.. నిరసన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలంలోని తక్కలపల్లి గ్రామానికి చెందిన మహిళలైతే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన చీరలను పెట్రోల్ పోసి మరీ తగలబెట్టేశారు. కేసీఆర్ భార్య గానీ, కోడలు గానీ.. కూతురు కవిత గానీ ఈ చీరలు కట్టుకుంటారా.. అంటూ నిలదీస్తున్నారు.