ఎరుకల వారి సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం సరికొత్త పధకం

తెలంగాణ లో మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక హామీలు కురిపిస్తూ వస్తున్నారు. తాజాగా తెలంగాణ సర్కార్ మరో నూతన పథకాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే రైతుల కోసం రైతు బంధు, యాదవ సోదరులకు గొర్రెల యూనిట్ల పంపిణీ, గంగపుత్రులకు చేప పిల్లల పంపిణీ, దళితుల కోసం దళిత బంధు కింద రూ.10 లక్షలు, వెనుకబడిన కులాలకు, చేతివృత్తులవారికి చేయూతనందించేందుకు బీసీ బంధు, ముస్లింలకు చేయూతనిచ్చేందుకు లక్ష ఆర్థిక సాయాన్ని అందించిన కేసీఆర్..తాజాగా ఎరుకల వారి సంక్షేమం కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. రూ.60 కోట్ల నిధులతో ఎరుకల సాధికారత పథకాన్ని ప్రకటించింది. అయితే.. ఈ పథకాన్ని ట్రైకార్‌ ద్వారా అమలు చేయనుంది.

ఎరుకల సోదరుల జీవనాధారం అయిన.. పందుల పెంపకం సొసైటీలకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పందుల పెంపకం, స్లాటర్‌ హౌస్‌, కోల్డ్‌ స్టోరేజీలకు, రవాణా, ఫోర్క్‌ రిటైల్‌ మార్కెట్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఒక్కో యూనిట్‌కు గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు 50 శాతం రాయితీ ఇవ్వనుంది. 40 శాతం బ్యాంకు నుంచి అప్పుగా, మరో 10 శాతాన్ని లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది.