రేపు విచారణకు హాజరుకాలేను..ఈడీని టైమ్ కోరిన రాహుల్‌

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ని ఈడీ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు రోజుల పాటు విచారించిన అధికారులు ఓ రోజు గ్యాప్ ఇచ్చి ..రేపు హాజరుకావాలని తెలిపారు. అయితే రేపు విచారణకు హాజరు కాలేనని.. సోమవారానికి వాయిదా వేయాలని రాహుల్ గాంధీ ఈడీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు లేఖ రాశారు. సోనియా గాంధీ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.

కరోనా అనంతరం అనారోగ్య సమస్యలు తలెత్తడంతో సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. రాహుల్‌, ప్రియాంక గాంధీ వాద్రా ప్రస్తుతం ఆమె వద్దే ఉన్నారు. తన తల్లి బాగోగులు చూసుకునేందుకు అనుమతించాలని, విచారణను పొడిగించాలని లేఖలో కోరారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో.. రాహుల్‌ గాంధీ పాత్రపై అనుమానాలు ఏమిటో ఈడీ ఇప్పటిదాకా స్పష్టత అయితే ఇవ్వలేదు. కానీ, మూడు రోజుల పాటు మాత్రం ఎనిమిది గంటలకు తక్కువ కాకుండా ప్రశ్నల వర్షం కురిపించింది ఈడీ. మరి రాహుల్ విజ్ఞప్తి ఫై ఈడీ ఏమంటుందో చూడాలి.

మరోపక్క రాహుల్ ను ఈడీ విచారించడం పట్ల దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు , నిరసనలు చేస్తూ వస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ ముట్టడికి పిలుపునివ్వగా, ఉద్రిక్తతకు దారి తీసింది.